
అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతి వనం
సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న లివింగ్ మెమోరియల్.
మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 'అటల్ బిహారీ వాజ్‌పేయి జీ స్మృతి వనం' (దశ-I) నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈనెల 11న ప్రభుత్వం జారీ చేసిన ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) పత్రం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక విగ్రహంగా మాత్రమే పరిమితం కాకుండా, పూర్తి సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. వాజ్‌పేయి గారి జీవితం, విలువలు, సుపరిపాలన, జాతీయ ఐక్యతను ప్రతిబింబించే ఈ స్మృతి వనం, ప్రజలకు విజ్ఞానాన్ని అందించే పబ్లిక్ స్పేస్‌గా రూపుదిద్దుకోనుంది.
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన అంశాలుగా వాజ్‌పేయి విగ్రహం, పీఠం, ఎగ్జిబిషన్ కమ్ మ్యూజియం, ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్, లైబ్రరీ పార్క్ ఉంటాయి. ఇది ఒక ‘లివింగ్ మెమోరియల్’గా రూపొందుతుంది. అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచి, సందర్శకులకు జ్ఞానాన్ని పంచుతుంది. ‘‘ఈ స్మృతి వనం వాజ్‌పేయి జీవితాన్ని ప్రతిబింబించేలా, ప్రజలను ప్రేరేపించేలా రూపకల్పన చేస్తారు.’’ అని ప్రాజెక్ట్ వివరాలు సూచిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) నిర్వహిస్తోంది. టెండర్ల ప్రక్రియ, కాంట్రాక్ట్ అప్పగింత, పనుల పర్యవేక్షణ, పరిపాలన వంటి అన్ని అంశాలు ఏజీఐసీఎల్ పరిధిలోనివే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) ప్రణాళిక, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే చట్టబద్ధ సంస్థగా వ్యవహరిస్తుంది. ఏజీఐసీఎల్ దీనితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. జనవరి 11, 2026న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ పని బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏజీఐసీఎల్‌కు అప్పగించింది.
ప్రాజెక్ట్‌ను 'డిజైన్-బిల్డ్' (డీబీ) విధానంలో అమలు చేయనున్నారు. అంటే ఒకే సంస్థకు పూర్తి బాధ్యతలు అప్పగించి, డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం, టర్న్‌కీ పద్ధతిలో పూర్తి చేసి అప్పగించాలి. ఎంపికైన సంస్థ పూర్తి డిజైన్‌ను రూపొందించడం, ఖర్చు అంచనాలు వేయడం, నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి. ఇది సమయం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా రూపొందిస్తారు.
అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈ స్మృతి వనం నిర్మాణం, రాష్ట్రానికి సాంస్కృతిక, టూరిజం రంగాల్లో కొత్త ఊపిరి తెచ్చే అవకాశం ఉంది. వాజ్‌పేయి జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందించే ఈ ప్రాజెక్ట్, జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

