
‘బలవంతపు మతమార్పిడి ఆధారాలు లేవు’
తంజావూరు విద్యార్థిని కేసులో సీబీఐ నివేదిక
తమిళనాడులో సంచలనం రేపిన తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య కేసులో బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. 2022లో జరిగిన ఈ ఘటనపై దాఖలైన చార్జ్‌షీట్‌లో మతమార్పిడి ఆరోపణలు నిర్ధారించలేకపోయామని స్పష్టం చేసింది.
సీబీఐ వివరాల ప్రకారం.. మైఖేల్పట్టి ప్రాంతానికి చెందిన 12వ తరగతి విద్యార్థిని మరణానికి ప్రధాన కారణం హాస్టల్ వార్డెన్ వేధింపులేనని తేలింది. మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేక్రెడ్ హార్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలను దర్యాప్తులో నిరూపించలేకపోయామని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ చార్జ్‌షీట్‌ను 2023 డిసెంబరులో తిరుచిరాపల్లి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ దాఖలు చేసింది.
విద్యార్థిని విడుదల చేసిన వీడియోలో కూడా మతమార్పిడి కంటే హాస్టల్ వార్డెన్ సిస్టర్ సగయ మేరీ వేధింపుల గురించే ప్రస్తావన ఉన్నట్లు సీబీఐ తెలిపింది. హాస్టల్ పనులు బలవంతంగా చేయించడంతో చదువుపై ప్రభావం పడిందని, నిరంతర మానసిక ఒత్తిడే ఆత్మహత్యకు దారితీసిందని నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 305తో పాటు జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 కింద సిస్టర్ సగయ మేరీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.
ఈ ఘటన అప్పట్లో తమిళనాడులో పెద్ద రాజకీయ వివాదానికి దారి తీసింది. బలవంతపు మతమార్పిడి జరిగిందని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆరోపణలు చేయగా, రాష్ట్ర పోలీసులు ఆ వాదనలను ముందుగానే ఖండించారు. 2022లో మద్రాస్ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయగా, తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు దర్యాప్తును నిలిపివేయలేదు.
2025 నవంబరులో సుప్రీంకోర్టు చార్జ్‌షీట్‌ను రికార్డులో ఉంచాలని ఆదేశించగా, సీబీఐ 2026 జనవరి 20న అఫిడవిట్‌తో పాటు చార్జ్‌షీట్‌ను సమర్పించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల బెంచ్ ఈ అంశాన్ని ఫిబ్రవరి 18న పరిశీలించనుంది. దీంతో బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

