
పండగ పూట చికెన్ చెట్టెక్కెన్!
చేపలు, రొయ్యలే దిక్కాయెన్!! ఇవేం రేట్లురా నాయనా!
సంక్రాంతి.. కనుమ అంటే చాలా ఇళ్లలో నాన్‌వెజ్ వంట తప్పనిసరి. కానీ ఈ ఏడాది సంక్రాంతి–కనుమ పండుగల వేళ సామాన్యుడి పళ్లెంలో చికెన్ ముక్క కూడా భారంగా మారింది. చికెన్ ధరలు అమాంతంగా పెరగడంతో పండగ రోజున కూడా “కొనాలా? వద్దా?” అన్న సందిగ్ధంలో కుటుంబాలు పడ్డాయి.
విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చికెన్ ధరలు రోజుకో రీతిలో మారుతున్నాయి. పత్రికలు, వెబ్‌సైట్లలో ప్రకటించే ధరలు ఒకలా ఉండగా, మార్కెట్‌లో వాస్తవంగా అమ్మే ధరలు మరోలా ఉండటం వినియోగదారులను అయోమయానికి గురిచేస్తోంది. కిలో రూ.200–220గా ప్రకటనల్లో కనిపిస్తున్నా, వాస్తవంగా మాత్రం రూ.320 నుంచి రూ.450 వరకు వివిధ సంస్థలు విక్రయిస్తున్నాయి. “మాది బ్రాండెడ్ చికెన్” అంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విజయవాడ మార్కెట్‌లో ప్రకటించిన రేట్లు
లైవ్ చికెన్: రూ.150–160
హోల్ (డ్రెస్డ్): రూ.200
స్కిన్‌లెస్: రూ.200–210
బోన్లెస్: రూ.220
లివర్: రూ.180
నాటు కోడి: రూ.380
అయితే ఇవి కేవలం “రేటు లిస్ట్”కే పరిమితమవుతున్నాయని, కొనుగోలు సమయంలో ఒక్కోచోట ఒక్కో ధర చెబుతున్నారని వినియోగదారులు అంటున్నారు.
అమ్మకాలు తగ్గినా ధరలు ఎందుకు?
వ్యాపారుల మాటల్లో చెప్పాలంటే, ధరలు పెరిగినప్పటికీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. సంక్రాంతి పండుగ కారణంగా బట్టలు, ఇతర గృహ ఖర్చులు పెరగడంతో చికెన్ కొనుగోళ్లపై ప్రజలు వెనకడుగు వేస్తున్నారని చెబుతున్నారు. రోజువారీ అమ్మకాలు సగానికి పడిపోయిన సందర్భాలూ ఉన్నాయని సమాచారం.
“ధరలు పెరిగినప్పటికీ కొనుగోలుదారులు తగ్గిపోయారు. అందుకే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంటుంది. పది రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సంక్రాంతికీ ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉంది,” అంటున్నారు చికెన్ సెంటర్ యజమాని సీహెచ్ కోటేశ్వరరావు.
ఇంటిగ్రేటెడ్ కంపెనీల ఆధిపత్యం
చిన్న, సన్నకారు బ్రాయిలర్ రైతులు నష్టాలు భరించలేక రంగం విడిచిపెట్టడంతో, చికెన్ మార్కెట్‌లో పెద్ద ఇంటిగ్రేటెడ్ కంపెనీల ఆధిపత్యం పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో 200 మందికి పైగా రైతులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య పదులకే పరిమితమైంది. దీంతో ధరల పెరుగుదల–తగ్గుదలపై కంపెనీలే నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న విమర్శలు బలపడుతున్నాయి.
బర్డ్ ఫ్లూ తర్వాత డిమాండ్
గతేడాది బర్డ్ ఫ్లూ భయాల కారణంగా కోడి మాంసం అమ్మకాలు తీవ్రంగా పడిపోయాయి. రోజుకు 10–11 లక్షల కిలోల వరకు ఉండే విక్రయాలు అప్పట్లో 4–5 లక్షల కిలోలకు తగ్గాయి. 2026 నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు, పౌల్ట్రీ సంఘాల ప్రచారంతో వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. హోటళ్లు, శుభకార్యాలు, పండుగలతో డిమాండ్ మళ్లీ పెరిగింది. అయితే ఈ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ధరలు కూడా చెట్టెక్కాయి.
చికెన్ ఖరీదైతే… చేపలు, రొయ్యల వైపు చూపు
చికెన్ ధరలు అందుబాటులో లేకపోవడంతో, పండగ నాడు చాలామంది వినియోగదారులు చేపలు, రొయ్యల వైపు మొగ్గు చూపుతున్నారు. “చికెన్‌కు బదులుగా రొయ్యలు, చేపలతోనే కనుమ వంటలు చేసుకుందాం” అన్న ఆలోచన పెరుగుతోంది.
రొయ్య రైతులకు ఊహించని షాక్
అయితే ఈ మారుతున్న డిమాండ్ రొయ్య రైతులకు మాత్రం ఊరటనివ్వలేదు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో వ్యాధులు, సీడ్, ఫీడ్ నాణ్యత లోపాలతో ఆక్వా సాగు విస్తీర్ణం ఇప్పటికే సుమారు 70 శాతం తగ్గింది. ఒక దశలో 100 కౌంట్ రొయ్య ధర రూ.220 నుంచి రూ.275 వరకు పెరిగి రైతుల్లో ఆశలు రేకెత్తాయి.
కానీ సంక్రాంతి ముందురోజుల్లోనే వ్యాపారులు అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేస్తామంటూ ప్రకటించి, ధరలను ఒక్కసారిగా రూ.25 తగ్గించారు. ప్రస్తుతం 100 కౌంట్ రొయ్య ధర రూ.250కి పడిపోయింది. “పండగ కోసం పెంచిన పంటను, పండగ నాటికే తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది” అంటూ రైతులు లబోదిబోమంటున్నారు.
పండగ పళ్లెం ముందు ధరల భారం
చికెన్ ధరలు చెట్టెక్కడం, రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవడం—ఈ రెండు మధ్యలో నలిగిపోతున్నది సామాన్య వినియోగదారుడూ, రైతే. కనుమ పండుగ ఆనందం ఉండాల్సిన చోట, ఈసారి ధరలే ప్రధాన చర్చగా మారాయి.
రొయ్య మార్కెట్ పరిస్థితి
ఒక దశలో 100 కౌంట్ రొయ్య ధర రూ.275 వరకు పెరిగింది.
సంక్రాంతి ముందు అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేతతో
ధర రూ.250కి పడిపోయింది.
ఒక్కో కౌంట్‌పై రూ.25 నష్టం – రైతులకు భారీ దెబ్బ.
చేపల వైపు మొగ్గు
చికెన్ ఖరీదవడంతో స్థానిక చేపల విక్రయాల్లో కొంత పెరుగుదల.
మధ్యతరగతి కుటుంబాలు “చికెన్ లేకపోయినా పండగ” అని భావన.
Next Story

