అరైజ్..అవేక్..చంద్రబాబు : జగన్
x

అరైజ్..అవేక్..చంద్రబాబు : జగన్

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.


జాతీయ యువజన దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో యువత ఎదుర్కొంటున్న పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని, చంద్రబాబు నాయుడు తన మోసపూరిత వాగ్దానాలతో యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

విద్యా పథకాలకు తిలోదకాలు: కుప్పకూలుతున్న విద్యా వ్యవస్థ!

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని వైఎస్‌ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకగా అమలు చేసిన పథకాలను ప్రస్తుత సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా గత ఎనిమిది త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు రూ. 4,900 కోట్ల విద్యా దీవెన, రూ. 2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు పేరుకుపోవడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన చెందారు. దీనికి తోడు యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని అందించే ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను కూడా నిలిపివేసి, విద్యార్థుల లక్ష్యాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని జగన్ మండిపడ్డారు.

నిరుద్యోగ భృతి ఏది?

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు తుంగలో తొక్కారని జగన్ విమర్శించారు. నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, రెండేళ్లుగా నయా పైసా కూడా చెల్లించకుండా యువతను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా భృతి అని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి.. ఇప్పుడు యువతకు వెన్నుపోటు పొడిచింది" అని దుయ్యబట్టారు.

వివేకానందుడి స్ఫూర్తితో హితవు:

స్వామి వివేకానంద చెప్పిన "లెండి, మేల్కొనండి.." (Arise, Awake..) అనే సూక్తిని ప్రస్తావిస్తూ జగన్ చంద్రబాబుకు హితవు పలికారు. యువత తమ లక్ష్యాలను సాధించేందుకు అడ్డుపడకుండా, వారికి అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏకాగ్రత, లక్ష్యంతో యువత కృషి చేస్తేనే దేశం బలపడుతుందన్న వివేకానందుడి నమ్మకాన్ని నిలబెట్టాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి వాగ్దానాన్ని నెరవేర్చాలని వైఎస్‌ జగన్ డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడటం ఆపాలని ఆయన ట్విటర్ వేదికగా హెచ్చరించారు.

Read More
Next Story