ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా?
x

ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా?

జూన్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఆ వాతావరణం ప్రభుత్వంలో కనిపించడం లేదు.


ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఎన్నికలు ఈ ఏడాది జరగడం అనుమానమేనని అధికార వర్గాలు అంటున్నాయి. ఎన్నికలు 2028 కి వాయిదా పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్‌, కోర్టు కేసులు, చట్టపరమైన సమస్యలు ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాల వారు పేర్కొంటున్నారు.

ఇటీవలి నిర్ణయాల్లో భాగంగా స్థానిక ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు కూడా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కీలక మార్పు తెచ్చారు. ఇది ఎన్నికల్లో మరింత మంది పాల్గొనేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ఎస్‌ఈసీ గడువులోగా ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రభుత్వ తీరు ఆధారంగా షెడ్యూల్‌లో మార్పులు రావచ్చని సమాచారం.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తన వంతు కసరత్తును శరవేగంగా కొనసాగిస్తోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్ల వారీగా కొత్త ఓటర్ల జాబితాల తయారీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసిన ఎస్‌ఈసీ.. మార్చి 9 నాటికి డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలను ప్రచురించాలని కలెక్టర్లు, డీపీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్చేలా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 13 నగర కార్పొరేషన్లలో 11 చోట్ల పదవీకాలం మార్చి 17తో ముగియనుండగా, 87 మున్సిపాలిటీలలో 75కి పదవీకాలం అదే తేదీన ముగుస్తుంది. 2021లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ కమిషనర్‌ నీలం సహాని అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. వార్డుల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.

ప్రభుత్వం తరఫున ఎన్నికల ప్రక్రియకు తగిన సహకారం లేకపోవడం వల్ల ఎస్‌ఈసీ స్వతంత్రంగా ముందుకు సాగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రభుత్వానికి లేఖ రాసిన ఎస్‌ఈసీ.. ఇటీవల మరోసారి మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో భేటీ అయింది. ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలకు అవకాశం కల్పించి తుది జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read More
Next Story