
క్రాంతి చైతన్యపై దేశద్రోహ కేసును ఖండించిన పౌరహక్కుల సంఘం
తిరుపతిలో ముగిసిన రెండు రోజుల పౌరహక్కుల సంఘం సభలు
పౌరహక్కుల సంఘం నేత క్రాంతి చైతన్యతో పాటు ఆరుగురు పౌర హక్కుల సంఘం నాయకులపై మోపిన అక్రమ దేశద్రోహ కేసులను వెంటనే ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఆయనతో పాటు అరెస్టయిన అందరిని క్రాంతి విడుదల చేయాలని కోరుతూ ఫ్లెక్సీలు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై అక్రమంగా మోపిన దేశద్రోహ కేసును కూాడా ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేయాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది. కేవలం వృత్తిపరమైన పనిని నిర్వహించిన వ్యక్తిపై ఇటువంటి తీవ్రమైన సెక్షన్లు నమోదు చేయడం అప్రజాస్వామికంఅని పేర్కొది. ఈ మేరకు ఈ రోజు సంస్థ రాష్ట్ర మహాసభల్లో ఒక తీర్మానం ఆమోదించింది.
చైతన్యంను శుక్రవారం నాడు తిరుపతిలో అరెస్టు చేిశారు. భారత రాజముద్రలోని మూడు సింహాలను వక్రీకరిస్తూ వేసిన ఒక కార్టూన్ ప్రదర్శించినందుకు ఆయనను అరెస్టు చేశారు. ఈ కార్టూన్ ని ఫ్లెక్స్ బోర్డు మీద ముద్రించినందుకు ప్రింటర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
తిరుపతి టౌన్‌కు చెందిన చినేపల్లి కిరణ్ కుమార్ (40 సం॥లు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.31/2026 U/sec 196 (1), 197 (1), 152, 292, 294 (2), 352, 351 (3), 353, 61 (2) r/w 3 (5) of BNS, 2023, Sec 2 of the Prevention of Insults to National Honour Act, 1971, Section 6 of the State Emblem of India (Prohibition of Improper Use) Act, 2005 మరియు Section 5 of the State Emblem and Names of India (Prohibition of Improper Use) Act, 1950 కింద కేసు నమోదు చేయడం జరిగింది.
తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభలో, చివరి రోజు ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతోపాటు పదహారు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా చిలుకా చంద్రశేఖర్ తిరిగి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కె.క్రాంతి చైతన్య, ఎన్. శ్రీమన్నారాయణ, ఎల్లంకి వెంకటేశ్వర్లు ఎన్నిక కాగా, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా టి.ఆంజనేయులు, పత్తిరి దానేషు, సురేషు ఎన్నికయ్యారు. కోశాధికారిగా డాక్టర్ టి.రాజారావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పి.రాజారావు, చామలపెంట్ల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.
పౌరహక్కుల పరిరక్షణ కోసం, పీడిత ప్రజల పక్షాన నిలబడి ముందుకు నడిపిస్తుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభ ఆకాంక్షంచింది. ఈ కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
సభల్లో ఆమోదించిన ఇతర తీర్మానాలు
బూటకపు ఎన్‌కౌంటర్ల ను తక్షణమే నిలిపివేసి, రాజ్యాంగబద్ధమైన జీవించే హక్కును కాపాడాలి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సామాన్య గిరిజనులను, ఆదివాసుల జీవించే హక్కును హరిస్తున్న 'ఆపరేషన్ కగార్' ను, అన్ని మిలటరీ చర్యలను నిలిపివేయాలి. ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి. మధ్య భారతంలో సహజ వనరుల దోపిడీ కోసం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ప్రజా వ్యతిరేక ఒప్పందాలను రద్దు చేయాలి.
కార్మికుల పనివేళలను 12 గంటల నుంచి తిరిగి 8 గంటలకు తగ్గించి, శ్రమ దోపిడీని అరికట్టాలి. జేఎన్‌యూ విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, ఇతర రాజకీయ ఖైదీలపై మోపిన అక్రమ కేసులను రద్దు చేసి, వారిని వెంటనే విడుదల చేయాలి. ముస్లిం, క్రైస్తవ మైనారిటీలపై ఆర్ ఎస్ ఎస్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు చేస్తున్న అక్రమ దాడులను వెంటనే అరికట్టాలి. విద్య, సామాజిక రంగాల్లో జరుగుతున్న కాషాయీకరణను పౌర హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, ఖండిస్తోంది.
దేశంలో పెరుగుతున్న హిందూత్వ పోకడలకు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాలి. దేశంలో పౌర ప్రజాస్వామ్యకు హక్కులను పరిరక్షించాలి. పౌర హక్కుల కోసం హిందూ మతోన్మాదాన్ని ఖండిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. వెనిజులాపై అమెరికా పెత్తనాన్ని, ఉక్రెయిన్ పై రష్యా దాడిని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న అమానవీయ దాడులను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు సంఘం సంఘీభావం ప్రకటిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టిన పి.పి.పి (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్) విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. వైద్య రంగం వ్యాపారీకరణను ఆపి, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి, ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందించాలి. అమరావతి ప్రాంతంలోని సాగు భూములను బడా పెట్టుబడిదారీ సంస్థలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు గంపగుత్తగా కట్టబెట్టడాన్ని నిలిపివేయాలి. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్ శక్తులకు భూములను ధారాదత్తం చేయడాన్ని పౌరహక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ముస్లిం మైనారిటీల ఆస్తుల పరిరక్షణకు ఉద్దేశించిన వక్ఫ్ చట్టాన్ని ఎటువంటి మార్పులు లేకుండా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి. వక్ఫ్ బోర్డు హక్కులను కాలరాసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలి. సామాన్య ప్రజలపై భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. నిత్యావసరమైన విద్యుత్తును లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
పౌర హక్కులను కాలరాస్తున్న నల్ల చట్టం 'ఊపా' ను తక్షణమే రద్దు చేయాలి. అలాగే, భారత న్యాయ సంహిత (బిఎన్ ఎస్)లో కొత్త రూపంలో ప్రవేశపెట్టిన దేశద్రోహ సెక్షన్లను పూర్తిగా తొలగించాలి. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించే ఈ చట్టాలను ప్రజాస్వామ్య సమాజం ఆమోదించదు. ఉపాధి హామీ పథకంలో కొత్త మార్పులను రద్దు, చేసి పాత చట్టాన్నే కొనసాగించాలని పౌరహక్కుల సంఘం మహాసభ తీర్మానించింది.

