2027 నాటికి భూవివాదాల్లేని ఏపీ
x

2027 నాటికి భూవివాదాల్లేని ఏపీ

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు డెడ్‌లైన్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా నిర్వహించిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా యంత్రాంగానికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించారు. పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ.. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ఐఎస్బీ (ISB) తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే అత్యున్నత సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి రైతుకు ఏఐ (AI) అగ్రానమిస్ట్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి 13న మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు కోసం ఈ ఏడాది మే 15నే నీటిని విడుదల చేస్తామని, రైతులు సీజన్ కంటే ముందే సాగుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పేదల ఇళ్లు - సంక్షేమ పథకాలు

ఉగాది కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించనున్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్రభుత్వ ట్రూ అప్ భారానికి భిన్నంగా, తొలిసారిగా ట్రూ డౌన్ చేశామని, రూ.4,600 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని సీఎం తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ కొనుగోలు ధరను మరో 39 పైసల మేర తగ్గించనున్నట్లు ప్రకటించారు.

నీటి సంరక్షణ - భూగర్భ జలాల పెంపు

ఏప్రిల్ 1 నుంచి జూన్ నెలాఖరు వరకు 90 రోజుల పాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. గత రెండు నెలల్లో భూగర్భ జలాలు 1.82 మీటర్ల మేర పెరగడం శుభపరిణామమని, ఇది పెరిగితే విద్యుత్ సబ్సిడీ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, వెలిగొండ ప్రాజెక్టును జూలై నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

2027 నాటికి భూవివాద రహిత ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. మార్చి 2027 నాటికి ఏపీని భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. వాస్తవాలన్నీ పోర్టల్‌లో పారదర్శకగా ఉంచడం ద్వారా వివాదాలను 70 శాతం వరకు తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళా సాధికారిత - స్టార్టప్ విజన్

ఇప్పటివరకు 1.12 లక్షల మంది మహిళలు మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా మారారని, వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 5 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2047 నాటికి ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

Read More
Next Story