sivaratri
x

ఆంధ్రాలో హోరెత్తుతున్న శివోహం

ప్రముఖ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ. కోటప్పకొండ, శ్రీశైలం, పంచారామాలు, శ్రీకాళహస్తి, రాజమండ్రిలో ప్రత్యేక ఏర్పాట్లు.


మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతటా శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద క్యూలైన్లు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా శివనామస్మరణ మార్మోగింది. వేకువజామునే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో నిండిపోయాయి.

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైలంలో వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి క్యూకట్టారు. సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. 7 గంటలకు జగద్గురు పీఠాధిపతి స్వామివారికి అభిషేకం చేయనున్నారు. నంది వాహనసేవ జరగనుంది. రాత్రి 10 నుంచి 12 గంటల వరకు పాగాలంకరణ, విశేష అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టనున్నారు. అర్ధరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా జరగనుంది. దర్శనం చేసిన ప్రతి భక్తుడికి 50 గ్రాముల లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించనున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహానంది, యాగంటి, కాల్వబుగ్గ, ఓంకారం క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. కోనేర్లలో పుణ్యస్నానాలు చేసి భక్తులు దర్శనానికి తరలివచ్చారు. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కూడా భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు, ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.
పంచారామ క్షేత్రాల్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమవరం సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి, అమరావతి అమరేశ్వర స్వామి, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి, ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. కోటప్పకొండ త్రీకోటేశ్వరుని సన్నిధిలోనూ రద్దీ పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
రాజమండ్రి పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ వద్ద గోదావరి పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. ధవలేశ్వరం నుంచి కాతేరు వరకు 11 స్నాన ఘట్టాలను అధికారులు ఏర్పాటు చేశారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. సీసీటీవీ కెమరాలతో కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు.
మొత్తం మీద మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తి వాతావరణం నెలకొంది. ప్రధాన శైవక్షేత్రాల్లో భద్రతా చర్యలు, ప్రత్యేక ఏర్పాట్ల మధ్య వేడుకలు కొనసాగుతున్నాయి.
కోటప్పకొండలో మహాశివరాత్రి భక్తుల సందడి
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రీకోటేశ్వరుని సన్నిధి భక్తులతో హోరెత్తింది. తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు కొండపైకి తరలివచ్చారు.

పొంగళ్లు పెట్టి పశువులను కొండచుట్టూ తిప్పి గులాంలు చల్లి సంబరం చేసుకుంటున్నారు. శివనామస్మరణతో కొండ ప్రాంతం మార్మోగుతోంది. ఈవేళ ఉత్సవానికి సుమారు 30 ప్రభలు రావొచ్చునని భావిస్తున్నారు.
Read More
Next Story