
లోకేష్‌ను దీవించిన ఏపీ ప్రథమ మహిళ సమీరా నజీర్
గవర్నర్ తేనీటి విందు కార్యక్రమానికి ప్రముఖులంతా సతీసమేతంగా హాజరయ్యారు.
విజయవాడ లోక్‌భవన్ వేదికగా గణతంత్ర వేడుకలు కనువిందు చేశాయి. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు నిర్వహించిన ’ఎట్ హోమ్‘ కార్యక్రమం రాజకీయ, న్యాయ, సామాజిక రంగాల అపురూప సంగమంగా నిలిచింది. సీఎం చంద్రబాబు కుమారుడు, కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ ను గవర్నర్ సతీమణి, ఆంధ్రప్రదేశ్ ప్రథమ మహిళ సమీరా నజీర్ ఆశీర్వదించడం ఈ ఎట్ హోమ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
లోక్‌భవన్ లాన్స్‌లో జరిగిన ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి విచ్చేశారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి హాజరై సందడి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అగ్రనేతలంతా ఒకే వేదికపై పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పాలన, న్యాయ యంత్రాంగం ఒక్కచోటే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కొలువుదీరింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానంతో పాటు మంత్రులు లోకేష్, అచ్చన్నాయుడు, సవిత, నారాయణ, కొల్లు రవీంద్ర, రామ్ ప్రసాద్ రెడ్డి ఇతర కేబినెట్ సహచరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సీఎస్, డీజీపీ వంటి ఉన్నతాధికారులు కూడా ఈ విందుకు హాజరై గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాన్య ప్రతిభకు సమున్నత గౌరవం కేవలం రాజకీయ నేతలే కాకుండా, సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులకు ఈ విందులో పెద్దపీట వేశారు. పద్మ అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర్య సమరయోధులు, క్రీడాకారులు, మహిళా సర్పంచ్‌లు, ప్రతిభావంతులైన విద్యార్థులు, ఎన్జీఓల ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వయంగా అతిథుల మధ్యలోకి వెళ్లి అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఆత్మీయతను చాటుకున్నారు. చల్లని సాయంత్రం వేళ సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ తేనీటి విందు గణతంత్ర స్ఫూర్తిని చాటిచెప్పింది.

