
వరికి బోనస్ ఇవ్వకుండా పండిస్తే క్యాన్సర్ వస్తుందని బెదిరిస్తున్న ముఖ్యమంత్రి
ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడం వల్ల వరి ఉత్పత్తిలో AP వెనుకబడి ఉంది.
రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎంతో ఉపయోగపడిన ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రస్తుత కూటమి సర్కార్ నిర్వీర్యం చేసింది. చివరకు రైతులు నేరుగా ప్రీమియం కట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చినా, జాతీయ స్ధాయిలో చూసినా వరి దిగుబడులు భారీగా పడిపోతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో రైతులకు మేలు చేసే ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం విచారకరం.
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్‌గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్‌లో కవర్ అయ్యేవారు. లక్షన్నర మంది వరకూ ఆప్షనల్‌గా ఇన్సూరెన్స్ తీసుకునే వారు. సాగు చేసే ప్రతి రైతుకు ఉచిత పంటల బీమా అందిస్తామని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఏ పంట వేసినా రైతుల్ని ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ–క్రాప్ విధానాన్ని పక్కాగా అమలు చేశారు. నాడు ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్ చెల్లించి, ఉచిత పంటల బీమా అమలు చేయడం ద్వారా, ఆ 5 ఏళ్లలో రైతులకు రూ.7802 కోట్ల ప్రయోజనం కలిగింది. ఆ మేరకు వారికి పరిహారం అందింది.
ఉచిత పంటల బీమా రద్దు చేసిన చంద్రబాబుగత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఉచిత పంటల బీమా రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. కానీ దేశంలోనే తొలిసారి రైతుల ఉచిత బీమాను రద్దు చేసేశారు. తొలి ఏడాది రైతులకు ఇన్సూరెన్స్ రద్దయిన విషయం కూడా తెలియలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగితే 2024 ఖరీఫ్‌లో కూడా ఈ–క్రాప్ వ్యాలిడేషన్ ప్రక్రియ జరుగుతోందని, అది పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం ప్రతిపాదనలు సిద్దం చేసి, అర్హులైన రైతులకు ఆ ప్రీమియమ్ చెల్లిస్తామంటున్నారు. కానీ ఇప్పటివరకూ ఈ ప్రీమియం చెల్లించలేదని తెలిసింది.
కాగా, అంతకు ముందు రుణం తీసుకున్న వారిలో 18 లక్షల మంది బీమా కవరేజ్ లో ఉంటే, ఈ సంవత్సరం ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ రెండూ కలిపి ఏడున్నర లక్షలకు పడిపోయారు.
గతంలో రుణం తీసుకున్న రైతుకు తప్పనిసరిగా బీమా ఉండేది. ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి దాన్ని కూడా ఆప్షనల్ చేశారు. రైతు ఇష్టమైతే కట్టుకోవచ్చు లేకపోతే లేదన్నారు. వరికి ఎకరానికి రూ.860, వాణిజ్య పంటల్లో అరటికి ఎకరాకు రూ.3 వేలు, మిర్చి, ప్రత్తి వంటి పంటలకు ఎకరాకు రూ.1800 వరకూ బీమా ప్రీమియమ్‌గా కట్టాలి.
తగ్గిన సాగు. యూరియా కొరత:
ప్రత్తి, ఉల్లి, మొక్కజొన్న దిగుబడులు పడిపోయాయి. మొంథా తుపాను తర్వాత వరి దిగుబడులు పడిపోతున్నాయని మేం చెప్తే ప్రభుత్వం 83 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని, 51 లక్షల టన్నుల వరి« ధాన్యం సేకరిస్తామని బుకాయించింది. కానీ, ఈ ప్రభుత్వంలో మాటలకు, క్షేత్రస్థాయిలో చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. సాగుకు సరిపడా యూరియా కూడా బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కోవాల్సిన దుస్థితి. వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు సరిపడా యూరియా అందడం లేదు. రాష్ట్రంలో 20.70 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉంటే.. ఇప్పుడు వరి సాగు 96 వేల హెక్టార్లు, జొన్న 64 వేల హెక్టార్లు, మొక్కజొన్న 2.54 వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు.
వరి ఉత్పత్తిలో పదో స్ధానానికి పడిపోయిన ఏపీ:
రాష్ట్రంలో రికార్డు స్దాయిలో 41 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. కానీ అది తప్పు. జగన్‌గారి హయాంలోనే 2019–20 ఖరీఫ్‌లో 47.85 లక్షల టన్నులు, 2020–21 ఖరీఫ్‌లో 44.46 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. అలాంటప్పుడు ఇప్పుడు 41 లక్షల టన్నులకే రికార్డు అని ఎలా చెబుతారు?. ఇంకా 51 లక్షల టన్నులు సేకరిస్తామని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చెబుతున్నారు.
మొంథా తుపాన్ తర్వాత వరి దిగుబడులు తగ్గాయన్నది నిజం. కానీ ప్రభుత్వం మాత్రం బుకాయిస్తూ వచ్చింది. కేంద్రం నివేదికల ప్రకారం ఈసారి ఖరీఫ్ లో 52.9 లక్షల బియ్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. తెలంగాణలో 70.28 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. వరి సేకరణలో దేశంలో యూపీ, పంజాబ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ టాప్–5లో ఉంటే, ఏపీ 10వ స్ధానంలో ఉంది. అందుకే ఈసారి ఆశించిన స్ధాయిలో వరి ఉత్పత్తి కావడం లేదన్న జగన్‌గారి మాట నిజమైంది.
జాతీయ స్థాయిలో సాగులో వెనకబడుతున్న రాష్ట్రం:
దేశవ్యాప్తంగా గత ఖరీఫ్‌లో లక్ష్యానికి మించి 102.5 శాతం సాగు జరిగితే ఏపీలో మాత్రం, లక్ష్యం కంటే తక్కువగా 93 శాతం మాత్రమే సాగు జరిగిందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. దేశంలో గత ఏడాది ఖరీఫ్‌లో 1096 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేయగా, దాన్ని మించి 1121 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. అదే సమయంలో మన రాష్టంలో 31.21 లక్షల హెక్టార్లకు బదులు 29.16 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. ఆ విధంగా సాగులో మన రాష్ట్రం వెనకబడి పోయింది.
పొరుగున తెలంగాణలో ఖరీఫ్‌లో 54.3 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, రబీలో 27.79 లక్షల హెక్టార్ల సాగును అంచనా వేశారు. అదే సమయంలో మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే.. ఖరీఫ్‌లో 29.16 లక్షల హెక్టార్లలో సాగు జరిగితే, రబీలో దాన్ని 20.70 లక్షల హెక్టార్లుగా అంచనా వేశారు. సాగులో గత రెండు సీజన్లలో తెలంగాణ దేశంలో తొలి స్ధానంలో ఉంటే, మనం మాత్రం 9వ స్ధానానికి పడిపోయాం.
ఇంకా తెలంగాణలో వరి సాగు ప్రోత్సహిస్తూ క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించగా.. మన దగ్గర అలాంటి ప్రోత్సాహం లేకపోగా, ఇంకా వరిసాగు వద్దని ప్రభుత్వం చెబుతోంది. యూరియా వినియోగిస్తే, ఆ వరి బియ్యం తిన్నవారికి క్యాన్సర్ వస్తుందని బెదిరిస్తోంది.
ప్రభుత్వ విధానం మారాలి:
ఈ ప్రభుత్వ మాటలకు, వాస్తవ గణాంకాలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. సాగు తగ్గుతోంది. దిగుబడి కూడా పడిపోతోంది. ఇంకా యూరియా కొరత దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ప్రోత్సాహకారిగా నిలవాల్సిన ప్రభుత్వం, అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. కనీసం ఉచిత పంటల బీమా పథకం కూడా అమలు చేయకపోవడం దారుణమైన తప్పిదం. రైతు ఆక్రందన రాష్ట్రానికి, ప్రభుత్వానికి అస్సలు మంచిది కాదని, అందుకే తక్షణమే ఉచిత పంటల బీమా అమలు చేయాలని ఎంవీఎస్ నాగిరెడ్డి తేల్చి చెప్పారు.
-ఎంవీఎస్ నాగిరెడ్డి
(వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి-వ్యవసాయం, రైతు సంక్షేమం)

