
ఏపీ బడ్జెట్‌కి ఫిబ్రవరి 14న ముహూర్తం
ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు దాదాపు నాలుగు వారాల పాటు సుదీర్ఘంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన బడ్జెట్ అంకం ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు గ్రాండ్‌గా షురూ కానున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో, అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు సామాన్య ప్రజల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 12వ తేదీ వరకు దాదాపు నాలుగు వారాల పాటు సుదీర్ఘంగా సాగే ఈ భేటీలు, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనున్నాయి.
14న ’పయ్యావుల‘ బడ్జెట్.. 13న సీఎం విజన్
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో చేసే ప్రసంగం హైలైట్‌గా నిలవనుంది. కూటమి ప్రభుత్వ విధానాలు, రాబోయే ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికలను ఆయన సభ ముందు ఉంచనున్నారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున రైతు సంక్షేమానికి అద్దం పట్టేలా మంత్రి అచ్చెన్నాయుడు విడిగా వ్యవసాయ బడ్జెట్‌ను సభకు సమర్పించనున్నారు.
నాలుగు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు
కేవలం బడ్జెట్ ఆమోదమే కాకుండా, ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, నూతన విధాన నిర్ణయాలపై ప్రభుత్వం చర్చించనుంది. అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశాలు లేవనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో చర్చలు ఏక పక్షంగానే సాగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని విజన్ 2047 దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన ఆర్థిక కేటాయింపులు, వ్యూహాలను ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వం ఖరారు చేయనుంది.

