
ఏపీ బడ్జెట్: రూపాయి రాక.. రూపాయి పోక ఇలా
ఆస్తుల కల్పన కోసం చేసే వ్యయాన్ని గతేడాది కంటే రూ. 14,417 కోట్లు పెంచారు.
గత ఐదేళ్ల ఆర్థిక అంధకారాన్ని చెరిపేస్తూ.. ప్రగతి వెలుగుల వైపు రాష్ట్రాన్ని నడిపించే అక్షయ పాత్రలా 2026-27 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఖజానాను గాడిలో పెడుతూనే, మరోవైపు సూపర్ సిక్స్ హామీలతో ప్రజల గుండెల్లో సంక్షేమ భరోసా నింపేలా ఈ పద్దును రూపొందించారు. కేవలం అంకెలతో ఆడుకునే గారడీ కాకుండా.. సంపద సృష్టి ద్వారా ప్రతి పేదవాడి సొంతింటి కలను, యువత ఉద్యోగ ఆశలను నెరవేర్చే అభ్యుదయ బాటగా ఈ బడ్జెట్ నిలుస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఏపీ వెల్త్ ఫండ్ వంటి వినూత్న ఆలోచనలతో అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమతూకం చేస్తూ కూటమి ప్రభుత్వం తన మార్క్ బడ్జెట్‌ను శాసనసభ ముందుకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, అభివృద్ధి-సంక్షేమమే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూనే, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా వినూత్న ప్రణాళికలను ఆయన తన ప్రసంగంలో ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో సింహభాగం సొంత పన్నుల ద్వారా వస్తుండగా, ఖర్చులో సంక్షేమం, అప్పుల వడ్డీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది.
ఆదాయం (రూపాయి రాక)
రాష్ట్ర సొంత పన్నులు: 38%
బహిరంగ మార్కెట్ రుణాలు: 30%
కేంద్ర పన్నుల్లో వాటా: 19%
గ్రాంట్ ఇన్ ఎయిడ్: 10%
పన్నేతర ఆదాయం: 3%
ఖర్చు (రూపాయి పోక)
సంక్షేమం: 17%
విద్య: 11%
వడ్డీలు, రుణాల చెల్లింపులు: 18%
గ్రామీణాభివృద్ధి: 7%
వైద్యం, సాగునీరు, వ్యవసాయం: ఒక్కో రంగానికి 4% నుండి 6% మధ్య కేటాయింపులు.
ఆర్థిక సంస్కరణలు: వడ్డీల భారం తగ్గించేలా వ్యూహం
గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్నమైన సంప్రదింపులు జరిపింది. 12.3 శాతంగా ఉన్న వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించేలా ఆర్థిక సంస్థలను ఒప్పించడం ద్వారా ఏడాదికి రూ. 327 కోట్లు ఆదా చేసింది. రాబోయే రోజుల్లో మరో రూ. 1.20 లక్షల కోట్ల రుణాలపై వడ్డీలను తగ్గించడం ద్వారా ఏడాదికి రూ. 1658 కోట్లు ఆదా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీ వెల్త్ ఫండ్: దేశంలోనే తొలిసారి
రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటును ప్రతిపాదించారు. రూ. 100 కోట్ల కార్పస్ నిధితో ప్రారంభమయ్యే ఈ సావరిన్ ఫండ్ ద్వారా దేశంలోని వివిధ లాభదాయక ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది. తద్వారా వచ్చే లాభాలను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించనున్నారు.
ప్రధాన శాఖల వారీగా కేటాయింపులు
సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
పాఠశాల విద్య: రూ. 32,308 కోట్లు
ఎన్టీఆర్ భరోసా: రూ. 27,719 కోట్లు
బీసీ వెల్ఫేర్: రూ. 23,650 కోట్లు
వ్యవసాయం & సాగునీరు: దాదాపు రూ. 30,000 కోట్లు (నీటివనరులు - రూ. 18,223 కోట్లు, వ్యవసాయం - రూ. 11,745 కోట్లు)
తల్లికి వందనం: రూ. 9,668 కోట్లు
అన్నదాత సుఖీభవ: రూ. 6,600 కోట్లు
తగ్గిన రెవెన్యూ లోటు.. పెరిగిన ఆస్తుల కల్పన
గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ప్రభుత్వం సఫలీకృతమైందని అంకెల ద్వారా వివరించారు.
రెవెన్యూ లోటు: 2025-26లో రూ. 41,118 కోట్లు ఉండగా, 2026-27 నాటికి దీనిని రూ. 22,002 కోట్లకు తగ్గించనున్నారు.
మూలధన వ్యయం (Capital Expenditure):
ఆస్తుల కల్పన కోసం చేసే వ్యయాన్ని గతేడాది కంటే రూ. 14,417 కోట్లు పెంచారు. తద్వారా రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టుల వంటి శాశ్వత ఆస్తుల నిర్మాణం వేగవంతం కానుంది. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడమే మా లక్ష్యం అని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. 11.75 శాతం వృద్ధి రేటును సాధించడమే కాకుండా, రాబోయే ఏడాదిలో కూడా రెండంకెల వృద్ధిని (10.75%) కొనసాగిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.

