
దావోస్ వేదికగా ’ఏపీ ఎడ్వాంటేజ్‘
పెట్టుబడుల గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రపంచ ఆర్థిక వేదికపై సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పెట్టుబడులు పెట్టాలంటే ఏపీని మించిన గమ్యస్థానం మరొకటి లేదు. ఇక్కడ కేవలం వ్యాపారం మాత్రమే కాదు.. వేగం (Speed) కూడా తోడవుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామిక దిగ్గజాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినిపించిన బలమైన గళమిది. మంగళవారం జరిగిన ’ఆంధ్రప్రదేశ్ ఎడ్వాంటేజ్‘ సదస్సులో ఏపీ భవిష్యత్తు ముఖచిత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.
రాష్ట్రమే మా బ్రాండ్.. వేగమే మా మంత్రం
పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో చంద్రబాబు తనదైన శైలిలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed of Doing Business) మంత్రాన్ని వల్లె వేశారు. 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పోర్టులు, ఎయిర్‌పోర్టులే రాష్ట్రానికి వెన్నెముక అని పేర్కొన్నారు. ప్రతి 50 కి.మీ. పరిధిలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి, తూర్పు తీరంలో ఏపీని ఎగుమతుల గేట్‌వేగా మారుస్తామని ఉద్ఘాటించారు. టెక్నాలజీ వినియోగంలో ఏపీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని చెబుతూ చంద్రబాబు ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. వ్యవసాయం, వైద్య రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచుతున్నామని, 2026 నాటికే ఏపీలో డ్రోన్ అంబులెన్స్ సేవలను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఐటీలో ఇప్పటికే సత్తా చాటామని, భవిష్యత్తులో జీడీపీలో 20% వాటాను పర్యాటక రంగం నుంచే సాధించేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వివరించారు.
పెట్టుబడుల వరద.. ఏపీ బ్రాండ్ ఇమేజ్
గత తొమ్మిది నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25% వాటాను ఏపీ ఒక్కటే ఆకర్షించడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌కి నిదర్శనమని సీఎం గర్వంగా ప్రకటించారు. విశాఖలో ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు నగరం, రూ.లక్ష కోట్ల బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం, గూగుల్ పెట్టుబడులు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయని వివరించారు.
చైనా, భారత్ మధ్య పోలిక.. బాబు విశ్లేషణ
పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. చైనా సంస్కరణలు 1978లోనే మొదలయ్యాయని, భారత్ 13 ఏళ్లు ఆలస్యంగా (1991లో) ప్రారంభించినా, ప్రస్తుతం మోదీ నాయకత్వంలోని సుస్థిర ప్రభుత్వం వల్ల వేగంగా దూసుకుపోతున్నామని విశ్లేషించారు. ఐటీ రంగంలో భారతీయుల ఆధిపత్యాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఏఐ (AI), క్వాంటం కంప్యూటింగ్ యుగంలోనూ మనమే విజేతలుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

