కనికరం లేని సెలవులు..ఉసురు తీస్తున్న ఒత్తిళ్లు
x

కనికరం లేని సెలవులు..ఉసురు తీస్తున్న ఒత్తిళ్లు

అధికారుల ఒత్తిడి భరించలేక మరో సచివాలయ ఉద్యోగి మృతి.


సచివాలయ ఉద్యోగుల పాలిట ’అధికారుల ఒత్తిడి‘ ఒక సైలెంట్ కిల్లర్‌లా మారుతోంది. టార్గెట్ల వేటలో ఉన్నతాధికారులు విసిరే ఫోన్ కాల్స్.. కనికరం లేని మందలింపులు సామాన్య ఉద్యోగుల ఊపిరి తీస్తున్నాయి. సంక్రాంతి పండుగ వేళ విశాఖలో టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ ఉదయ్ కుమార్ గుండెపోటుతో ప్రాణాలు వదలగా, ఆ విషాదం మరువకముందే కడపలో హెల్త్ సెక్రెటరీ విజయకుమారి అధికారుల గద్దింపుకు తట్టుకోలేక అకస్మాత్తుగా మృతి చెందారు. వలంటీర్లు లేని లోటును పూడ్చే క్రమంలో పెరిగిన అదనపు భారం, మరోవైపు పైస్థాయి అధికారుల నుంచి వచ్చే తీవ్రమైన ఒత్తిడి మధ్య క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణాలరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తోందన్న ఆవేదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

పండుగ వేళ ఫోన్ కాల్‌తో మొదలైన ఒత్తిడి

వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని గౌస్ నగర్ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్న జి. విజయకుమారి (42) మృతి చెందడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. ఈ నెల 17న పండుగ వేళ అందరూ సంబరాల్లో ఉంటే, ఆమె మాత్రం తన విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. అయితే, అదే సమయంలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆమె పాలిట శాపంగా మారింది. సర్వేలు ఎందుకు పూర్తి చేయలేదు.. పై నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది.. రేపో మాపో కాదు, ఇప్పుడే చేసి తీరాల్సిందే అంటూ అధికారులు ఫోన్‌లో గట్టిగా మందలించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఒకవైపు పండుగ రోజు కూడా పనిచేస్తున్నా.. అధికారుల కనికరం లేని గద్దింపు ఆమెను మానసికంగా కృంగదీసింది.

గుండె బరువెక్కి.. నిలిచిన ఊపిరి

అప్పటికే శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విజయకుమారి, అధికారుల వేధింపులతో మరింత ఒత్తిడికి గురయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైన తలనొప్పిగా ఉందని, నీరసంగా ఉందని తన కుమార్తెతో బాధగా చెప్పుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఒక్కసారిగా ఊపిరి ఆడటం లేదని చెబుతూ కళ్లు మూసుకుని అలాగే ఒరిగిపోయారు. ఏ క్షణాన తన తల్లికి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్న ఆ పిల్లల కళ్ల ముందే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అధికారుల టార్గెట్ల వేటలో తమ తల్లి బలైపోయిందని, వారి ఒత్తిడే ప్రాణాలు తీసిందని ఆమె కుమారుడు, కుమార్తె చేస్తున్న రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి.

పండుగ పూట పని భారంతో ఆగిన గుండె

ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో పండుగ సంబరాల్లో మునిగితేలుతున్న వేళ, విశాఖపట్నం అరిలోవ సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న సుంకర ఉదయ్ కుమార్ మాత్రం టార్గెట్ల వేటలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సంక్రాంతి సెలవుల్లో కూడా విశ్రాంతి లేకుండా పనిచేయాలని, నిరంతరం సర్వేలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తీవ్రమైన ఆదేశాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పండుగ పూట కూడా కనికరం లేకుండా అధికారులు చేసిన ఒత్తిడితో ఆయన మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురయ్యారు. ఆ ఒత్తిడిని భరించలేక ఆయన గుండె ఒక్కసారిగా వేగం అందుకుని, చివరికి చప్పుడు చేయకుండా ఆగిపోయింది.

ప్రశ్నార్థకమైన ఉద్యోగుల భద్రత

విజయకుమారి మృతి వార్త విన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఆమె నివాసానికి చేరుకుని కన్నీటి నివాళులర్పించారు. సర్వేలు, టార్గెట్లు అంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఎంతవరకు సమంజసం అని వారు నిలదీస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా కనికరించకుండా, పండుగ సెలవుల్లో కూడా వేధించడం వల్లే ఇలాంటి వరుస మరణాలు సంభవిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు మారకుంటే సామాన్య ఉద్యోగుల ప్రాణాలకు భరోసా ఉండదని, విజయకుమారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మేము మనుషులమా.. యంత్రాలమా

సచివాలయ ఉద్యోగుల వరుస మరణాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, మేము మనుషులమా లేక విరామం లేకుండా పనిచేసే యంత్రాలమా? అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గతంలో ఒక సచివాలయంలో ఎనిమిది మంది కార్యదర్శులు, వారికి సహాయంగా 20 మంది వలంటీర్లు ఉండేవారని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం ఐదారుగురికి పడిపోయిందని వారు గుర్తు చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో, వారు చేయాల్సిన క్షేత్రస్థాయి సర్వేలు, డేటా ఎంట్రీ పనులన్నీ ఇప్పుడు సెక్రటరీల పైనే పడుతున్నాయని, ఈ అదనపు పనిభారం మోయలేక ఉద్యోగులు శారీరకంగా, మానసికగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Next Story