
వైట్ హౌస్‌లో ’ఆంధ్రా అల్లుడి‘ సందడి
నాలుగోసారి తండ్రి కాబోతున్న జేడీ వాన్స్
అమెరికా వైట్ హౌస్‌లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. మన తెలుగు కోడలు ఉషా చిలుకూరి, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ దంపతులు తమ జీవితంలో మరో మధురమైన ఘట్టానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే తమ కుటుంబంలోకి నాలుగో అతిథి రాబోతున్నట్లు ఈ క్రేజీ కపుల్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు సృష్టించబోతున్న ఉషా చిలుకూరి
అమెరికా చరిత్రలో ఒక ఉపాధ్యక్షుడి భార్య పదవిలో ఉండగా గర్భం దాల్చడం ఇదే మొదటిసారి. ఈ రకంగా మన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ దంపతులకు ఈవాన్(8), వివేక్(5), మిరాబెల్(4) అనే ముగ్గురు పిల్లలు ఉండగా.. జూలై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రాబోతున్నాడని వాన్స్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
యేల్ వర్సిటీ సాక్షిగా చిగురించిన ప్రేమ
ప్రపంచ ప్రఖ్యాత యేల్ లా స్కూల్ ప్రాంగణంలో వీరి పరిచయం ఒక అందమైన మలుపుతో మొదలైంది. చదువుల్లో మేటిగా ఉన్న తెలుగు తేజం ఉషా చిలుకూరి ప్రతిభకు, జేడీ వాన్స్ ఆకర్షితులయ్యారు. ఒక ప్రాజెక్ట్ చర్చల మధ్య మొదలైన వీరి స్నేహం, అభిప్రాయాల కలయికతో త్వరగానే ప్రేమగా మారింది. అలా యేల్ యూనివర్సిటీ క్లాస్ రూమ్స్ సాక్షిగా చిగురించిన ఈ ప్రేమాయణం, 2014లో పెళ్లి పీటల వరకు చేరింది.
ఈ వివాహం కూడా ఎంతో ప్రత్యేకంగా జరిగింది. అటు జేడీ వాన్స్ విశ్వాసాలకు అనుగుణంగా క్రైస్తవ పద్ధతిలో, ఇటు ఉష కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ ఆచారాల ప్రకారం ఒక వేద పండితుడి సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మూలాలు ఉన్న వారు కావడంతో, సహజంగానే మన తెలుగు వారందరికీ జేడీ వాన్స్ 'ఆంధ్రా అల్లుడు' అయిపోయారు. నేడు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆయన వైట్ హౌస్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించినా, ఒక తెలుగు అల్లుడిగా తన కుటుంబ విలువల పట్ల ఆయన చూపే గౌరవం అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రో-ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్
అమెరికాలో ఎక్కువ మంది పిల్లలు పుట్టాలి, కుటుంబాలు కలకలలాడాలి అని ఎప్పుడూ చెప్పే జేడీ వాన్స్, ఇప్పుడు తన మాటను నిజం చేస్తూ నాలుగో బిడ్డకు తండ్రి కాబోతుండటం విశేషం. ఈ వార్త తెలిసిన వెంటనే వైట్ హౌస్ అధికారిక వర్గాలు సైతం చరిత్రలోనే అత్యంత కుటుంబ అనుకూల (Pro-family) ప్రభుత్వం ఇది అని కొనియాడాయి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే..
పశ్చిమ దేశాల రాజకీయాల్లో బిజీగా ఉన్నా, మన తెలుగు సంస్కృతిని, కుటుంబ విలువలను గౌరవించే ఉషా చిలుకూరి ఇంట ఈ కొత్త అతిథి రాక కోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7
— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026

