
ఏపీలో ఒక్కసారిగా పెరిగిన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
విజయవాడలో ఇవాళ ఉదయానికే ఉష్ణోగ్రతలు 24-26 డిగ్రీల సెల్షియస్ మధ్య నమోదు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేసవి రాకముందే రాష్ట్రంలో భానుడి సెగ తగులుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయానికే విజయవాడలో ఉష్ణోగ్రతలు 24-26°C, మధ్యాహ్నం గరిష్ఠం 35-38°C (95-101°F)కు చేరాయి. విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉదయం ఉష్ణోగ్రతలు 23-25°C మధ్య ఉండగా సాయంత్రానికి గరిష్ఠంగా 29-31°C (84-88°F) చేరాయి. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలలో ఉదయం 23-26°C, సాయంత్రానికి గరిష్ఠంగా 30-35°Cకి చేరాయి.
శనివారం నందిగామ, కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. విశాఖపట్నం, తుని, నరసాపురం, బాపట్ల తదితర ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 21-25°C, మధ్యాహ్నం గరిష్ఠంగా 30-38° డిగ్రీల సెల్షియస్ గా ఉన్నాయి. ఎండ ఎక్కువగా ఉంది.
కొనసాగుతున్న అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం (well-marked low pressure area) కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం (ఫిబ్రవరి 23) నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలకు కారణమవుతోంది.
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా
రానున్న 3 రోజుల్లో (ఫిబ్రవరి 23-25 సుమారు) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం, సోమవారాల్లో (23-24) తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చు. ఇప్పటికే ఇవాళ రాష్ట్రంలో ఎండలు పెరగడంతో జనం ఉక్కపోతలో కుతకుతలాడిపోయారు.
Next Story

