పుట్టినరోజే విషాదం: అమెరికాలో ఏపీ టెక్కీ నీట మునిగి మృతి
x

పుట్టినరోజే విషాదం: అమెరికాలో ఏపీ టెక్కీ నీట మునిగి మృతి

మిస్సోరిలో మెరామెక్ నదిలో ప్రమాదం; ప్రాణాలు కోల్పోయిన యువ ఇంజనీర్..


Click the Play button to hear this message in audio format

అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సింగిరెడ్డి సాయి శ్రీ హరి కృష్ణ తన పుట్టినరోజునే నదిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మిస్సోరి (Missouri) రాష్ట్రంలోని మెరామెక్ నది (Meramec River) వద్ద ఏప్రిల్ 11న జరిగింది.

ఈతకు దిగి..

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన హరి కృష్ణ, స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడానికి సుల్లివాన్ సమీపంలోని మెరామెక్ స్టేట్ పార్క్‌కు వెళ్లాడు. ఈత కోసం నదిలోకి దిగిన అతడు, నీటి అడుగున ఉన్న కలుపు మొక్కల్లో చిక్కుకుని ప్రమాదానికి గురయ్యాడు.

నీటిలోకి దిగిన కొద్ది క్షణాలకే హరి కృష్ణ బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే, కలుపు మొక్కలు అతడిని లోపలికి లాగడంతో అతను పైకి తేలలేకపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న రక్షణ సిబ్బంది శోధన చేపట్టి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు.

మూడేళ్ల క్రితం అమెరికాకు..

హరి కృష్ణ చదువులో ప్రతిభావంతుడు. విజయనగరంలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత 2023లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, ఇటీవలే సెయింట్ లూయిస్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం పొందాడు. ఈతపై ఆసక్తి ఉన్న అతను తరచూ నీటిలోకి దిగేవాడని స్నేహితులు తెలిపారు.

ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి శ్రీనివాసరావు ఆటో డ్రైవర్ కాగా, తల్లి రమాదేవి ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగి. ఇద్దరు సోదరీమణులతో కలిసి కుటుంబం జీవిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఇంటికి ఫోన్ చేసి ఇల్లు కట్టేందుకు డబ్బు పంపుతానని చెప్పిన కుమారుడు ఇలా దూరమవడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

ప్రస్తుతం హరి కృష్ణ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Read More
Next Story