
’ముసలితనం‘లోకి ఆంధ్రప్రదేశ్..2031 నాటికి ఏపీ ’వృద్ధాప్య‘ రాష్ట్రం
ఆర్‌బీఐ నివేదికలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులే ఉండే దిశగా ఏపీ ప్రయాణిస్తొందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ యవ్వనం మెల్లగా కరిగిపోతోందా? నిత్యం ఉరకలెత్తే ఉత్సాహంతో, శ్రామిక శక్తితో కళకళలాడే ఏపీ.. మరో ఐదేళ్లలో ’ముసలితనం‘ దిశగా అడుగులు వేయబోతోందా? అంటే అవుననే అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నివేదిక. దేశవ్యాప్త జనాభా పరివర్తనపై ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర భవిష్యత్తుపై ఆందోళనకరమైన అంచనాలను రేకెత్తిస్తున్నాయి. 2031 నాటికి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ’వృద్ధాప్య రాష్ట్రం‘ (Aging State) అనే ముద్ర వేయించుకోబోతోంది. తగ్గిపోతున్న యువత, పెరుగుతున్న వృద్ధుల జనాభాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలాంటి కుదుపులకు లోనుకాబోతోంది. సంపాదించే చేతులు తగ్గి, పెన్షన్లు-వైద్యంపై భారం పెరిగితే ఏపీ భవిష్యత్తు ఏంటి. ఆర్‌బీఐ సంచలన నివేదికలోని ముఖ్యాంశాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఆర్‌బీఐ నివేదిక - 2026: ఏపీ ఆర్థిక భవిష్యత్తుపై జనాభా పరివర్తన ప్రభావం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి 2026 మూడవ వారంలో విడుదల చేసిన ’రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు: 2025-26 బడ్జెట్ల విశ్లేషణ‘ నివేదికలో భారతీయ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం (Fiscal Health)పై జనాభా మార్పులు చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా విశ్లేషించింది. ఈ నివేదిక ప్రధానంగా 2016 నుండి 2036 వరకు ఉన్న జనాభా గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుని, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్రాల ఆదాయ వనరులు ఎలా క్షీణిస్తాయో అంచనా వేసింది. జనాభాలో వృద్ధుల వాటా పెరిగే కొద్దీ పనిచేసే వారి సంఖ్య తగ్గి పన్ను వసూళ్లు మందగిస్తాయని, అదే సమయంలో పెన్షన్లు.. వైద్య సేవల కోసం చేసే ’కమిటెడ్ ఎక్స్‌పెండిచర్‘ (Committed Expenditure) విపరీతంగా పెరుగుతుందని ఆర్‌బీఐ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఇంటర్మీడియెట్ స్థాయి నుంచి వృద్ధాప్య స్థాయికి అతివేగంగా చేరువవుతోందని, 2031 నాటికి ఇది ఆర్థికంగా అత్యంత క్లిష్టతరమైన దశకు చేరుకుంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పరివర్తనను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
ఆర్‌బీఐ రాష్ట్రాల వర్గీకరణ: జనాభా వయస్సును బట్టి మూడు విభాగాలు
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే క్రమంలో, 60 ఏళ్లు పైబడిన వారి జనాభా శాతం ఆధారంగా ఆర్‌బీఐ రాష్ట్రాలను మూడు కీలక వర్గాలుగా విభజించింది. మొదటిది ’యువ రాష్ట్రాలు‘ (Youthful States) - ఇక్కడ వృద్ధుల జనాభా 10% కంటే తక్కువగా ఉంటుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక్కడ పనిచేసే యువత అధికంగా ఉండటం వల్ల ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కార్మిక వనరులుగా పనిచేస్తాయి. రెండవది ’ఇంటర్మీడియెట్ రాష్ట్రాలు‘ (Intermediate States) - ఇక్కడ వృద్ధుల జనాభా 10% నుండి 15% మధ్య ఉంటుంది, ఇవి ప్రస్తుతం సాపేక్షంగా స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. ఇక మూడవది ’వృద్ధాప్య రాష్ట్రాలు‘ (Aging States) - వీటిలో వృద్ధుల వాటా 15% లేదా అంతకంటే ఎక్కువ. ఇప్పటికే కేరళ, తమిళనాడు ఈ కేటగిరీలోకి చేరిపోగా, ఇక్కడ శ్రామిక శక్తి తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో వృద్ధి రేటు మందగించే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ హెచ్చరించింది. జనాభాలోని ఈ వ్యత్యాసాలే ఆయా రాష్ట్రాల పన్ను ఆదాయాన్ని, కేంద్ర నిధుల కేటాయింపులను ప్రభావితం చేస్తాయని నివేదిక స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఆర్‌బీఐ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ జనాభా ముఖచిత్రంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించిన అంచనాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఏపీ ప్రస్తుతం ’ఇంటర్మీడియెట్‘ కేటగిరీలో ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల కంటే అత్యంత వేగంగా వృద్ధాప్యం దిశగా పయనిస్తోందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా 2031 సంవత్సరాన్ని రాష్ట్రానికి ఒక డెడ్‌లైన్‌గా పేర్కొన్న నివేదిక, ఆ నాటికి వృద్ధుల జనాభా 16.4 శాతానికి చేరుకుంటుందని, తద్వారా రాష్ట్రం అధికారికంగా వృద్ధాప్య రాష్ట్రం (Aging State) కేటగిరీలోకి ప్రవేశిస్తుందని హెచ్చరించింది. 2026 నాటికి 14.1 శాతంగా ఉండే వృద్ధుల వాటా, 2036 నాటికి 18.9 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులే ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పనిచేసే యువశక్తి తగ్గిపోవడమే కాకుండా, పెన్షన్లు.. వైద్య సేవల (Health Care) కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది రాష్ట్ర ఖజానాపై కోలుకోలేని ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని ఆర్‌బీఐ తన నివేదికలో విశ్లేషించింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వృద్ధాప్య గండం
రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరగడం అనేది కేవలం ఒక సామాజిక మార్పు మాత్రమే కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలనే కదిలించే గంభీరమైన అంశం. ఆర్‌బీఐ హెచ్చరికల ప్రకారం.. జనాభాలో యువ రక్తం తగ్గడం వల్ల పనిచేసే శ్రామిక శక్తి (Labor Force) క్రమంగా క్షీణిస్తుంది. ఫలితంగా రాష్ట్ర వృద్ధి రేటు (GDP) తీవ్రంగా మందగించే ప్రమాదం ఉంది. సంపాదించే యువత తగ్గితే వ్యక్తిగత ఆదాయ పన్నులు, ఇతర పన్ను వసూళ్లు తగ్గి ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. దీనికి విరుద్ధంగా, వయసు మళ్లిన వారి కోసం ప్రభుత్వం చేసే పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ (Health Care) ఖర్చులు రెట్టింపు అవుతాయి. అంటే ఆదాయం తగ్గి.. ఖర్చు తడిసి మోపెడవుతుందన్నమాట. దీనికి తోడు, వృద్ధాప్య రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల బదిలీల్లో కూడా కోత పడే అవకాశం ఉంది. వెరసి, ఈ జనాభా పరివర్తన భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి ఒక పెద్ద సవాలుగా మారబోతోంది.
కీలకమైన సూచనలు.. పరిష్కార మార్గాలు
ఆంధ్రప్రదేశ్ వృద్ధాప్య రాష్ట్రం (Aging State) కేటగిరీలోకి వెళ్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన నివేదికలో కొన్ని కీలకమైన సూచనలు.. పరిష్కార మార్గాలను ప్రతిపాదించింది.
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతం (Health Care Infrastructure).. వృద్ధుల జనాభా పెరిగే కొద్దీ దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్య సమస్యల చికిత్సకు డిమాండ్ పెరుగుతుంది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలి. ముఖ్యంగా వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ కేర్ (Geriatric Care) సెంటర్లను జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందుబాటులోకి తెవాలి అని సూచించింది.
పెన్షన్ విధానంలో సంస్కరణలు (Pension Reforms).. శ్రామిక శక్తి తగ్గి, పెన్షన్ తీసుకునే వారి సంఖ్య పెరిగినప్పుడు అది ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారంగా మారుతుంది. దీని కోసం రాష్ట్రాలు తమ పెన్షన్ బాధ్యతలను నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయని రీతిలో పెన్షన్ ఫండ్లను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్‌బీఐ సూచించింది.
శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచడం (Labor Force Skilling).. పనిచేసే యువత సంఖ్య తగ్గుతున్నప్పుడు, ఉన్న కొద్దిమంది యువత అత్యంత నైపుణ్యం కలిగి ఉండటం అవసరం. అందువల్ల క్వాంటిటీ (ఎక్కువ మంది పనివారు) లేని చోట క్వాలిటీ (నైపుణ్యం గల పనివారు) తో ఆ లోటును భర్తీ చేయాలి. యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇచ్చి, తక్కువ మందితో ఎక్కువ ఉత్పాదకత సాధించేలా (Higher Productivity) చర్యలు తీసుకోవాలి అని సూచించింది.
ఆదాయ మార్గాల అన్వేషణ (Revenue Mobilization)..వృద్ధాప్య రాష్ట్రాల్లో వ్యక్తిగత ఆదాయ పన్నులు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల పన్ను ఆదాయం తగ్గుతున్నప్పుడు, పన్నుయేతర ఆదాయ మార్గాలను (Non-tax revenue) అన్వేషించాలి. అలాగే పట్టణీకరణను ప్రోత్సహించడం ద్వారా సేవా రంగం నుండి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్‌బీఐ తెలిపింది.
సిల్వర్ ఎకానమీపై దృష్టి (Promoting Silver Economy).. వృద్ధుల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలను అందించే పరిశ్రమలను సిల్వర్ ఎకానమీ అంటారు. వృద్ధులకు అవసరమైన హెల్త్-టెక్, అసిస్టెడ్ లివింగ్, ఇతర సేవలను ఒక ఆర్థిక అవకాశంగా మలుచుకోవాలని, తద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చని ఆర్‌బీఐ సూచించింది.

