సీఎం సారు, ఈ వృద్ధురాలి ధర్మాగ్రహం చూడండి! ఈ నిరసన ఎందుకో తెలుసా?
x
విజయవాడలో అధికారులపై కారం చల్లి వృద్ధురాలి నిరసన

సీఎం సారు, ఈ వృద్ధురాలి ధర్మాగ్రహం చూడండి! ఈ నిరసన ఎందుకో తెలుసా?

సామాన్యులు తిరగబడితే అధికారులు ఏమవుతారో..అధికారుల కళ్లల్లో కారం కొట్టి.. ఓ వృద్ధురాలి నిరసన ఎందుకు?


ఒక సామాన్య పౌరురాలు, పైగా వృద్ధురాలు... వ్యవస్థ నిర్లక్ష్యంపై ‘ధర్మాగ్రహం’ ప్రకటిస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఘటన అద్దం పడుతోంది. అధికార దర్పం, నిర్లక్ష్యం, జాప్యం పరాకాష్టకు చేరినప్పుడు పుట్టే ఆవేదనకు ఈ కారం చల్లడం ఒక నిరసన రూపం. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా సామాన్యులు ఎంత ఇక్కట్లు పడుతున్నారో గమనిస్తే మంచింది.
అది ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా కేంద్రం.. వందలాది మంది అధికారులు, నిరంతరం తిరిగే ఫైళ్లు, న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చే సామాన్యులు. కానీ, అక్కడే ఒక వృద్ధురాలి సహనం నశించింది. ఏళ్ల తరబడి తన భూమి కోసం, తన హక్కుగా రావాల్సిన పరిహారం కోసం కలెక్టరేట్ మెట్లు ఎక్కి ఎక్కి అలసిపోయిన ఆ బామ్మ, చివరకు తన ఆవేదనను ‘కారం’ రూపంలో అధికారుల ముఖంపై కొట్టింది.
అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట..
నేషనల్ హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం ఆమె భూమిని తీసుకుంది. అభివృద్ధికి అడ్డుపడకూడదని భూమిని ఇచ్చింది. కానీ, ఆ భూమికి రావాల్సిన రూ. 24 లక్షల పరిహారం మాత్రం ఫైళ్లలోనే చిక్కుకుపోయింది. ఒక సామాన్య వ్యక్తికి 24 లక్షల రూపాయలు అంటే జీవితకాలం దాచుకున్న ఆస్తి. ఆ డబ్బు కోసం ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమాధానం లేకపోవడం రెడ్ టేపిజం (జాప్యం) క్రూరత్వానికి నిదర్శనం.
ఆవేదన నుంచి పుట్టిన ఆగ్రహం
"నా భూమిని తీసుకున్నారు.. కానీ పరిహారం మాత్రం వేరే వాళ్లకు చెల్లించారు" అని ఆ వృద్ధురాలు మీడియా ముందు వాపోతున్న తీరు వింటుంటే, వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో అర్థమవుతోంది. తప్పు సరిదిద్దమని వేడుకున్నా కనికరించని అధికారుల తీరుతో విసుగెత్తిన ఆమె, ఇక శాంతియుత వినతులు పని చేయవని భావించి ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చారు.
ఇది ఒక వ్యక్తి నిరసన మాత్రమే కాదు..
ఈ ఘటన కేవలం ఒక అధికారిపై జరిగిన దాడి కాదు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే మొత్తం యంత్రాంగంపై ఒక బాధితురాలి ధర్మాగ్రహం. అధికారుల టేబుళ్లపై ఫైళ్లు కదలవు. బాధితుల కన్నీళ్లు కనిపించవు. పాలకుల హామీలు అమలు కావు.
ఓ సాదాసీదా మనిషికి ఎంత కోపం, ఎంత ఆవేదన వస్తే అధికారులపై కారం చల్లే స్థాయికి వెళ్తుందో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పరిహారం ఇవ్వడంలో జరిగిన జాప్యంపై, అక్రమంగా వేరే వారికి డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై తక్షణమే విచారణ జరపాలి.
అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని ఫైళ్లను పెండింగ్‌లో పెట్టినంత కాలం, ఇలాంటి బాధితుల ఆక్రందనలు ఆగవు. ఈ ఘటన బ్యూరోక్రసీకి ఒక హెచ్చరిక. నిబంధనల పేరుతో సామాన్యులను వేధిస్తే, ఆ ఆవేదన చివరకు ఇలాగే కట్టలు తెంచుకుంటుందని ఈ వృద్ధురాలు నిరూపించారు. ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరుగుతుందా? లేదా ఆమెపై కేసులు పెట్టి ఈ గొంతును నొక్కేస్తారా? అన్నది చూడాలి.
Read More
Next Story