అమ్మలు ఉన్నంత కాలం చెరిగిపోని ‘అమ్మముచ్చట్లు’
x

'అమ్మ ముచ్చట్లు ' పుస్తకావిష్కరణ సభలో ఎడమ నుంచి రాఘవ శర్మ , క్రాంతి నల్లూరి, కాకరాల , ఆకుల మల్లేశ్వర రావు, డాక్టర్ ప్రేమావతి, ప్రభాకర్ రెడ్డి.

అమ్మలు ఉన్నంత కాలం చెరిగిపోని ‘అమ్మముచ్చట్లు’

‘అమ్మ ముచ్చట్లు’ రచయిత మనల్ని నడిపిస్తాడు, మళ్ళీ గతంలోకి తొంగి చూసేలా చేస్తాడు. పద చిత్రాలు,భావ చిత్రాలతో ఇదొక వ్యక్తి వికాస గ్రంథం.



తిరుపతి : ఈ భూమి మీద అమ్మల చరిత్ర ఉన్నంత కాలం ‘అమ్మముచ్చట్లు’ పుస్తకం శాశ్వతత్వం పొందుతుందని ప్రముఖ రంగస్థల, సినీ నటులు కాకరాల అన్నారు. సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ రచించిన ‘అమ్మముచ్చట్లు‘ పుస్తకాన్ని కాకరాల ఆవిష్కరించారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ ఆకుల మల్లేశ్వర రావు అధ్యక్షతన ఆదివారం ఉదయం వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ సభ జరిగింది.


ప్రముఖ రచయిత్రి, ఒంగోలుకు చెందిన కాంతి నల్లూరి పుస్తకాన్ని సమీక్షిస్తూ, అమ్మలోని అభ్యుదయ వాదికి, సంప్రదాయ వాదికి మధ్య నిత్యం ఘర్షణ జరగుతుంటుంది, ఎప్పుడూ అభ్యుదయ వాది దే పై చేయి అవుతుంది. నిత్యం ప్రశ్నిస్తూ, తర్కిస్తూ, ఘర్షణ పడుతూ మన మధ్యే అమ్మ ఉంటుంది. పని సంస్కృతికి అమ్మ ఒక ప్రతీక. పరాధీనం వృథా జన్మ అనేది జీవిత సత్యం అన్నారు. ఒక్క పరుషపదం కూడా లేని ఈ పుస్తకంలో ప్రతిపేజీ, ప్రతి పేరా, ప్రతి వాక్యం, ప్రతి పదం, ప్రతి అక్షరం చాలా విలువైనవని అన్నారు.
సహజంగానే అమ్మ ఒక అద్భుతం, ఈ అమ్మ మరీ అద్భుతం, ఈ పుస్తకాన్ని అందరూ చదవడం ద్వారా అమ్మకు నివాళులు అర్పించినట్టవుతుందని పేర్కొన్నారు. పుస్తకం చదువుతుంటే సమాజం కోసం వీరేశలింగం, కొడవటిగంటి, శ్రీపాద ఎంత కష్టపడ్డారో తెలుస్తుందని గుర్తు చేశారు. అమ్మ గురించి పుస్తకం అంటే అది తొంభై ఏళ్ళ సామాజిక చరిత్ర. ఈ పుస్తకంలో ఉండే పది మంది మహిళలు పురుష సమాజపు బాధితులే. అమ్మ ముచ్చట్లు చదువుతుంటే కన్నీళ్ళు కారిపోతాయి.

ఈ సభకు అధ్యక్షత వహించిన ఆకుల మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ‘అమ్మ ముచ్చట్లు’ రచయిత మనల్ని నడిపిస్తాడని, మళ్ళీ గతంలోకి తొంగి చూసేలా చేస్తాడని పేర్కొన్నారు. వాక్యాల్లో పద చిత్రాలు,భావ చిత్రాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదొక వ్యక్తి వికాస గ్రంథం అన్నారు.

సాహితీవేత్త డాక్టర్ డి.ప్రేమావతి మాట్లాడుతూ సృష్టి కి మూలం అమ్మ. అమ్మలో శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. ప్రపంచంలో విజ్ఞానాన్ని కలిగించే రచయత గోర్కీ అమ్మ నవల. పి.వి. నరసింహారావు అమ్మ గురించి అవ్వ అనే కథ రాశారు. అమ్మ విమలమ్మకు ధైర్యం ఎక్కువ, శక్తి కూడా ఎక్కువేనని అన్నారు.

అటవీ రేంజ్ అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జన్మకు మూలమైన అమ్మను అనాథాశ్రయాల్లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఇలా చేస్తే మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూస్తారని హెచ్చరించారు. ప్రముఖ చిత్రకళాకారిణి కిరణ్ కుమారి మాట్లాడుతూ ‘అమ్మ ముచ్చట్లు’ ను పాత్రికేయ ధోరణితో రాశారని, స్త్రీల సమస్యలను మరింత లోతుగా పరిశీలించి రాస్తే బాగుంటుందని సూచించారు. డాక్టర్ బాలాజి, డాక్టర్ గాయత్రి తదితరులు ఆప్తవాక్యాలు పలికారు. చివరగా అమ్మ ముచ్చట్లు రచయిత రాఘవ శర్మ మాట్లాడుతూ, కాకరాల వంటి ఒక మహా వ్యక్తి చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపచేయడంతో ఈపుస్తకానికి మరింత ఔన్నత్యం వచ్చిందని అన్నారు.

కాకరాల చిన్న పాత్రల మహానటుడని, సినిమా రంగంలో ఉంటూనే ఎవరినీ వేషాల కోసం చేయిచాచలేదని, ఆత్మాభిమానంతో జీవించారని కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ సభకు తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ సభ్యులు ఎంతో సహకరించార ని అన్నారు. సైన్స్ విజ్ఞానాన్ని కలిగిస్తే, సాహిత్యం సంస్కారాన్ని కలిగిస్తుందని, వేమన విజ్ఞాన కేంద్రం ఈ రెంటినీ ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు కల్పిస్తోందని వివరించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన సభలో అనేక మంది పురప్రముఖులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.




Read More
Next Story