
జనరల్ అసెంబ్లీలో రష్యాకు అనుకూలంగా ఓటు వేసిన అమెరికా
ఈ వారంలోనే యుద్ద విరమణ ఉంటుందని జెలెన్ స్కీ సూచనలు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత రష్యా- ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం మూడు తీర్మానాలు ఉన్నాయి.
ఇందులో మొదట అమెరికా ప్రవేశ పెట్టిన తీర్మానంలో యుద్దాన్ని ముగించాలని కోరింది. కానీ రష్యా దురాక్రమణ గురించి ఎక్కడైనా మాట మాత్రమైన ప్రస్తావించలేదు. దీనిపై యూరోప్ దేశాలు కినుక వహించాయి.
ప్రస్తుతం అమెరికా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించింది. 15 మంది సభ్యుల కౌన్సిల్ లో ఓటింగ్ 10-0 గా ఉంది. ఐదు దేశాలు గైర్హజరయ్యారు. ఇవన్నీ కూడా యూరోపియన్ దేశాలే కావడం గమనార్హం.
ఉక్రెయిన్ తీర్మానానికి వ్యతిరేకం..
అంతకుముందు అమెరికా నేరుగా తీసుకొచ్చిన తీర్మానాన్ని యూఎన్ భద్రతామండలి ఆమోదించలేదు. కానీ కొన్ని చిన్నచిన్న మార్పులు చేసిన తరువాత తిరిగి ఆమోదం పొందింది. అయితే చాలామంది మాత్రం ‘‘రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ పై దాడికి పాల్పడింది’’ అని అంగీకరించారు.
జనరల్ అసెంబ్లీలో మరో తీర్మానంలో రష్యన్ దళాలు వెంటనే ఉక్రెయిన్ భూభాగం నుంచి వైదొలగాలని చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా, రష్యా లు కలిసి ఓటు వేయగా, యూరప్ మాత్రం అమెరికాకు విరుద్దంగా వ్యవహరించింది.
రష్యా దురాక్రమణదారు అని ఫ్రాన్స్ తీసుకొచ్చిన తీర్మానానికి అమెరికా దూరంగా ఉంది. ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కు అతిథ్యం ఇస్తున్న సమయంలో ఐరాసలో ఈ తీర్మానం ఓటింగ్ జరిగింది.
వీరి సమావేశం ముగిసిన తరువాత ట్రంప్ తో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భేటీ కాబోతున్నారు. మొన్నటి దాకా యుద్దాన్ని కొనసాగించాలని కోరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికా బాటలో నడవడానికి సిద్దంగా కనపడుతున్నాయి.
యూరప్, ఉక్రెయిన్ లో శాంతిపరిరక్షక దళాలు ఉండటానికి పుతిన్ అంగీకరిస్తారని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పారు. మరో వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం ఈ వారంలోనే యుద్దం ముగుస్తుందని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆయన అమెరికా వెళ్లి కీలక ఖనిజాలను అమెరికా పరం చేస్తారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. దీనికి ప్రతిగా అమెరికా ఎలాంటి హమీ కీవ్ కు ఇస్తుందో ఇరువర్గాలు బయటపెట్టడం లేదు.
ప్రస్తుతం ట్రంప్ ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించారు. అలాగే శాంతి చర్చల్లో కూడా ఉక్రెయిన్ కానీ, యూరప్ ను గానీ భాగస్వామ్యం చేయదలుచుకోలేదు. దీనితో ఆయా కూటములు ఈ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
జెలెన్ స్కీ నియంత గా అభివర్ణించిన ట్రంప్
ఉక్రెయిన్ కవ్వించడం వల్లే రష్యా దాడికి దిగిందని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని ట్రంప్ ఇప్పటికే నియంత అని అభివర్ణించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగింపు పలకాలని హితవు పలికారు. లేకపోతే దేశమే లేకుండా పోతుందని హెచ్చరించారు.
ఉక్రెయిన్ తీర్మానానికి ఆమోదం
సోమవారం జరిగిన తొలి ఓటింగ్ లో జనరల్ అసెంబ్లీ 93-18 తో ఉక్రెయిన్ తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆమోదించింది. 65 దేశాలు గైర్హాజరయ్యాయి. దీనిప్రకారం ఉక్రెయిన్ కొంత మద్దతు తగ్గినట్లు కనిపించింది. ఇంతకుముందు ఇలాంటి తీర్మానికే ఐరాసలో 140 దేశాలు మద్దతు తెలిపాయి.
మూడు సవరణలు ప్రతిపాదించిన ఫ్రాన్స్
యూఎన్ లో ఫ్రాన్స్ మూడు సవరణలను ప్రతిపాదించింది. వీటికి యూరోపియన్ దేశాల పూర్తి మద్దతు ఉంది. ప్యారిస్ ప్రకారం.. ఈ వివాదానికి కేంద్ర బిందువు రష్యా. యూఎన్ చార్టర్ ప్రకారం.. ఉక్రెయిన్ కు సార్వభౌమత్వం, స్వాత్రంత్య్రం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత ఉందని వాదిస్తోంది. తన దేశాన్ని రక్షించుకునే హక్కు కీవ్ కు ఉందని సమర్థిస్తూనే శాంతి కావాలని డిమాండ్ చేస్తోంది.
Next Story