అంబేద్కర్ గురుకులాల్లో 2026-27 ప్రవేశాల ఫలితాలు
x
అంబేద్కర్ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల రిజల్ట్ విడుదల చేస్తున్న మంత్రి స్వామి

అంబేద్కర్ గురుకులాల్లో 2026-27 ప్రవేశాల ఫలితాలు

అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి డా.స్వామి


డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన BRAGCET-2026 ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి గురువారం వెలగపూడి సచివాలయంలో అధికారికంగా విడుదల చేశారు.

2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో 15,020 ఖాళీ సీట్లు, జూనియర్ ఇంటర్‌లో 13,840 సీట్లకు మార్చి 1న ప్రవేశ పరీక్ష నిర్వహించగా, 6, 7, 8, 9, 10 తరగతుల ఖాళీలకు మార్చి 8న పరీక్ష జరిగింది. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 1,15,313 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,01,799 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 88.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలు విడుదల చేసిన అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ “అడ్మిషన్లకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్న నమ్మకం మరియు విశ్వాసానికి నిదర్శనం” అన్నారు.

రాష్ట్రంలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లను 3 నుంచి 10కి పెంచినట్లు తెలిపారు. ఐఐటీ, నీట్‌లో తృటిలో అర్హత కోల్పోయిన విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తున్నామని, గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్, నీట్‌తో పాటు దేశీయ, రాష్ట్ర స్థాయి ప్రసిద్ధ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు.

సీట్లు సాధించిన విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆకాంక్షించారు.

ఫలితాలు తనిఖీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ https://apbragcet.apcfss.in ద్వారా ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read More
Next Story