కొత్త అల్లుళ్లకు అదిరిపోయే ‘అతి’థి మర్యాదలు!
x
నర్సీపట్నంలో 290 వంటకాల ముందు అల్లుడు, కూతురు

కొత్త అల్లుళ్లకు అదిరిపోయే ‘అతి’థి మర్యాదలు!

కొత్త అల్లుళ్లకు వందల సంఖ్యలో పిండి వంటలను వడ్డించడం ఇప్పుడు గోదారి జిల్లాల నుంచి పొరుగు జిల్లాలకు పాకుతోంది.


పెళ్లయి తొలి సంక్రాంతికి అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి వందల సంఖ్యలో పిండి వంటకాలతో ఉక్కిరికి బిక్కిరి చేయడం గోదావరి జిల్లాల వారికే ఇన్నాళ్లూ సొంతం. ఇప్పుడా సంస్కృతి పొరుగు జిల్లాలకూ విస్తరిస్తూ విస్తుపోయేలా చేస్తోంది. అతిథి మర్యాదల్లో గోదారోళ్లకు పెట్టింది పేరు. ఇంటికొచ్చిన అతిథులకు తమ మర్యాదలతో ఊపిరాడకుండా చేయడం వీళ్లకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇక పెళ్లయిన తర్వాత తొలి సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లకైతే చెప్పే పనే లేదు. అల్లుళ్లపై ఉండే ప్రేమానురాగాలను వీరు పిండి వంటల రూపంలో రుచి చూపిస్తారు. చాలామంది పదో, పదిహేనో రకాలను వండి పెడతారు. కానీ కొంతమంది మాత్రం అలా ఊరుకోరు. వంద, నూట యాభై, రెండొందలు, మూడొందలు రకాలను కొత్త అల్లుడి కోసం సిద్ధం చేస్తారు. సంక్రాంతి రోజున ఆ అల్లుడితో పాటు కూతురిని కూర్చోబెట్టి వాటిని ఆరగించమని అరటాకులో వడ్డిస్తారు. తొలుత అత్తమామలు, ఆ ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు, బావమర్దులు, మరదళ్లు వరసగా వారికి తినిపిస్తారు. అందరూ ఆ తంతు ముగించాక ఇక అల్లుడు గారిని కడుపారా, పూటుగా తినమని వదులుతారు. అవి తినాలి.. ఇవి తినాలి అంటూ బలవంత పెడతారు. వాటిలో తనకు నచ్చినవి కొన్ని తిని బ్రేవుమని తేన్చి అక్కడ నుంచి అతికష్టమ్మీద బయటపడతాడు.


తెనాలిలో అల్లుడికి సిద్ధం చేసిన 158 పిండివంటలు

రికార్డుల కోసం తాపత్రయం..

ఒకప్పుడు మర్యాద కోసం కొత్త అల్లుడికి వడ్డించే పిండి వంటలు ఇప్పుడు అదుపు తప్పుతున్నాయి. గతంలో పదుల సంఖ్యలో ఉండే ఈ వంటకాలు రానురాను వందలకు చేరుకున్నాయి. ఇది ఎలా తయారైందంటే.. ఫలానా సుబ్బారావు గారి కొత్త అల్లుడికి వంద రకాల వంటకాలు పెట్టార ంట! అని ఒకరంటే.. మరో యాభై రకాలు అధికంగా వెంకట్రావు తన అల్లుడికి వడ్డిస్తాడు. ఈ సంగతి తెలిసిన మరో మామ గొప్పలకు పోయి రెండు వందల రకాల పిండివంటలకు సిద్ధమైపోతాడు. గోదావరి జిల్లాల్లో ఇలా కొంతమంది రికార్డుల కోసం అల్లుడి వంటకాలను సిద్ధం చేయడంలో పోటీ పడుతున్నారు. సిసలైన సంప్రదాయాలను గౌరవించే వారిని విస్తుపోయేలా చేస్తున్నారు.

నర్సీపట్నంలో అల్లుడి కళ్లకు గంతలు కట్టి తీసుకొస్తూ..

పొరుగు జిల్లాలకూ పాకుతోంది..
కొత్త అల్లుళ్లకు లెక్కకు మిక్కిలి వంటకాలను వడ్డించడం గోదావరి జిల్లాల్లో అనాదిగా వస్తున్న ఆచారం. సంప్రదాయం. ఇప్పుడా ‘అతి’థి మర్యాదల సంస్కృతి పొరుగు జిల్లాలకూ పాకుతోంది. ఇన్నాళ్లూ ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకే సొంతమైన ఈ కల్చర్‌.. పొరుగున ఉన్న అనకాపల్లి (పూర్వ విశాఖపట్నం జిల్లా), ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు విస్తరిస్తోంది. గోదారి జిల్లాల వారిని తలదన్నేలా వందల సంఖ్యలో పిండి వంటకాలను సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుళ్లకు వడ్డిస్తూ తమ దర్పాన్ని ప్రదర్శించుకుంటున్నారు.

పాయకరావుపేటలో కొత్త అల్లుడికి వడ్డించిన 122 వంటకాలు

సోషల్‌ మీడియా వచ్చాక మరింతగా..

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా విస్తృతమయ్యాక కొత్త అల్లుళ్లకు వడ్డించే వంటకాల సంస్కృతి మరింత పెరిగింది. తమ అల్లుడికి ఇన్ని రకాల పిండి వంటలను పెట్టామని చెప్పుకోవడానికి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయా ఇళ్లలో ఉంటున్న యువత ఒకడుగు ముందుకేసి అల్లుడి ముందు అరిటాకులో వంటకాలను సిద్ధం చేసి సెల్‌ఫోన్లో వీడియో తీసి వాటిని సోషల్‌ మీడియాకు వదులుతున్నారు. అవి వైరల్‌గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఇలా ఒకరిని చూసి మరొకరు సంప్రదాయం పేరిట వేలం వెర్రిగా ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు.
నర్సీపట్నంలో అల్లుడికి 290 వంటకాలు..
ఉమ్మడి విశాఖ జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా) నర్సీపట్నంలోని శాంతినగర్‌కు చెందిన నాళం రమేష్‌కుమార్, కళావతి దంపతుల కుమార్తె లక్ష్మీనవ్యను శ్రీహర్షకు ఇచ్చి ఇటీవలే పెళ్లి చేశారు. కొత్త అల్లుడు శ్రీహర్షకు ఇదే తొలి సంక్రాంతి కావడంతో ఈ పండుగను గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. అల్లుడి వయసు 29 ఏళ్లు. దాని పక్కన ‘0’ (సున్నా) చేర్చి ఏకంగా 290 రకాల వంటకాలను సిద్ధం చేసి గురువారం సంక్రాంతి నాడు వడ్డించారు. ఈ అల్లుడి కళ్లకు గంతలు కట్టి మరీ ఆ వంటకాల వద్దకు తీసుకొచ్చారు. గంతలు విప్పాక తన కోసం సిద్ధం చేసిన వాటిని చూసి ఆ కొత్త అల్లుడికి గుండె ఆగినంత పనైంది.
158 వంటకాలతో తెనాలిలో..
ఇక గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఓ అత్తమామలు తమ కొత్త అల్లుడికి ఇలాగే చేశారు. తెనాలికి చెందిన మురళీకృష్ణ, మాధవీలత దంపతులు తమ కుమార్తె మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి కొన్నాళ్ల క్రితం వివాహం చేశారు. ఆ అల్లుడు గురువారం అత్తారింటికి తొలి సంక్రాంతికి వస్తున్న సందర్భంగా ఆ అత్తమామలు 158 రకాల వంటలను స్వయంగా తయారు చేశారు. వాటిని తమ కొత్త అల్లుడికి డైనింగ్‌ టేబుల్‌పై అరిటాకులు వేసి వాటిపై వడ్డించారు. గోదావరి జిల్లాలకు తీసిపోని విధంగా కొత్త అల్లుడికి 158 రకాల పిండి వంటలను వడ్డించడం తమ ప్రాంతానికి కొత్త కావడంతో స్థానికులు విశేషంగా చర్చించుకున్నారు.
పాయకరావుపేటలోనూ వినూత్నంగా..
ఇక అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోనూ ఓ అత్తామామలు తొలి సంక్రాంతికి వచ్చిన తమ కొత్త అల్లుడికి 122 పిండి వంటలను వడ్డించారు. పాయకరావుపేట పట్టణానికి చెందిన కోటిపల్లి రమణ, అమ్మాజీల కుమార్తె తనూజను సతీష్‌కు ఇచ్చి ఇటీవలే పెళ్లి చేశారు. తమ ఇంట్లో కొత్త అల్లుడికి 122 రకాల వంటకాలను వడ్డించి కొసరి కొసరి మరీ తినిపించారు. అంతకుముందు బాణసంచా కాలుస్తూ, హారతులిస్తూ పూలు చల్లుతూ వినూత్న రీతిలో కొత్త అల్లుడికి స్వాగతం పలికారు.
Read More
Next Story