
అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ ఆకృతి ఊహాత్మక చిత్రం
అమరావతి కొత్త అసెంబ్లీని చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా ఉంటుందన్నారు మంత్రి నారాయణ
రాజధాని అమరావతిలో కట్టబోయే అసెంబ్లీ చూస్తే దిమ్మ తిరగాల్సిందేనంటున్నారు రాష్ట్ర మంత్రి నారాయణ. రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, అమరావతిలో కట్టేవి ఐకానిక్ భవనాలని సోమవారం మీడియాతో కూడా చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం ఏపీలో ఉంటుందన్నారు. రాజధాని కోసం చేసిన అప్పుల్ని భూముల్ని అమ్మి తీరుస్తామని కూడా చెప్పారు.
అసలింతకీ అసెంబ్లీ ఎలా ఉంటుందంటే..
ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుంది. నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా ఉంటుంది. అది కేవలం ఓ కట్టడమే కాదు. అది భావి తరాలకు పనికొచ్చే అద్భుత నిర్మాణం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ కు ప్రతిరూపం అన్నారు మంత్రి నారాయణ.
'లిల్లీ పువ్వు' ఆకృతిలో...
బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ 'నార్మన్ పోస్టర్, పార్ట్నర్స్' ఈ భవనానికి రూపకల్పన చేసింది. ఈ భవనం చూడటానికి బోర్లించిన లిల్లీ పువ్వు (ఇన్వర్టెడ్ లోటస్) ఆకారంలో ఉంటుంది. ఆధునికత, భారతీయ సంప్రదాయాల మేలు కలయికగా నిలుస్తుంది.
ఈ అసెంబ్లీ భవనాన్ని ఒక కృత్రిమ సరస్సు మధ్యలో ఉన్నట్టు నిర్మిస్తారు. నీటిపై తేలియాడుతున్నట్లు కనిపిస్తుంది. చూసే వాళ్లకు మతిపోయేలా ఉంటుంది.
భవనం పైభాగంలో సుమారు 250 మీటర్ల ఎత్తు ఉండే భారీ టవర్ (Spire) ఉంటుంది. ఇది అమరావతి నగరంలో ఎక్కడి నుంచైనా కనిపించేలా, రాష్ట్రానికే ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది.
ప్రజల కోసం.. ప్రజల మధ్యలో..
చంద్రబాబు ఈ భవనాన్ని "ప్రజా రాజధాని"కి అద్దం పట్టేలా తీర్చిదిద్దుతున్నారు. భవనం పైభాగానికి వెళ్లేందుకు ఒక స్పైరల్ ర్యాంప్ ఉంటుంది. అక్కడికి వెళ్లిన ప్రజలు అసెంబ్లీ లోపల జరిగే కార్యకలాపాలను పైనుంచి చూడవచ్చు. అంటే, పాలన పారదర్శకంగా, ప్రజల కళ్ల ముందే జరుగుతుందనే సందేశాన్ని ఇది ఇస్తుంది.
అసెంబ్లీ చుట్టూ 60% కంటే ఎక్కువ భాగం పార్కులు, జలపాతాలు, చెట్లతో నిండి ఉంటుంది. ఇది న్యూయార్క్ లోని 'సెంట్రల్ పార్క్' తరహాలో ఒక పచ్చని తోరణంలా కనిపిస్తుంది.
భవనం పైకప్పు అంతా సోలార్ ప్యానెళ్లతో నిండి ఉంటుంది. భారతదేశంలోనే పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడిచే మొట్టమొదటి స్టేట్ అసెంబ్లీగా ఇది రికార్డు సృష్టించబోతోంది.
స్మార్ట్ గవర్నెన్స్...
డిజిటల్ ట్విన్ మోడల్స్, పబ్లిక్ వైఫై, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌లతో ఈ భవనం ప్రపంచంలోని అత్యుత్తమ స్మార్ట్ బిల్డింగ్స్‌తో పోటీ పడనుంది.
మరో 3 ఏళ్లలోనే అందుబాటులోకి...
గత ఐదేళ్ల విరామం తర్వాత, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు శరవేగంగా పుంజుకుంది. సుమారు 3,000 మంది కార్మికులు, వందలాది భారీ యంత్రాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. 3 ఏళ్లలో ఐకానిక్ భవనాలను పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది.
"అమరావతి అంటే తెలుగు వారి ఆత్మగౌరవం" అని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా, ఈ అసెంబ్లీ భవనం కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన కట్టడం కాదు.. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల కలల సాకారం. మే 2, 2025న ప్రధాని మోదీ చేతుల మీదుగా మరోసారి శంకుస్థాపన చేసుకున్న ఈ భవనం 2047 నాటికి 'వికసిత్ భారత్' విజన్‌లో ఆంధ్రప్రదేశ్ పోషించబోయే కీలక పాత్రకు నిదర్శనంగా నిలుస్తుందని మంత్రి నారాయణ చెబుతున్నారు.
Next Story

