
అమరావతి క్వాంటం వ్యాలీ భారత్‌కు కొత్త దిశ
ఏపీలో తాత్కాలికంగా క్వాంటం మిషన్ కార్యాలయం ప్రారంభం
అమరావతి క్వాంటం వ్యాలీని ప్రపంచ స్థాయి క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అధికారులు కీలక ప్రకటన చేశారు. మేధా టవర్స్‌లో క్వాంటం కంప్యూటింగ్ మిషన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇది ఏపీని 2030 నాటికి ప్రపంచంలోని ఐదు గ్లోబల్ క్వాంటం హబ్‌లలో ఒకటిగా మార్చే మార్గంలో మైలురాయి అని అధికారులు స్పష్టం చేశారు.
నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ తోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీడాక్, సీడాట్, డీఆర్‌డీఓ, బార్క్ సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. క్వాంటం కంప్యూటర్ పరికరాల తయారీ కంపెనీలు, క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ రంగాల కంపెనీల ప్రతినిధులు కూడా భాగస్వామ్యం వహించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ పరికరాల తయారీ, ఇతర హార్డ్‌వేర్, అల్గారితమ్స్ తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. 2030 నాటికి ఏపీని ప్రపంచంలోని ఐదు గ్లోబల్ క్వాంటం హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హార్డ్‌వేర్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కోసం వేగవంతమైన కార్యాచరణ చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.
బయోఫౌండ్రీ సహా వివిధ స్టార్టప్‌ల సహకారంతో డిజైన్లు, ఆవిష్కరణలు, పరిశోధనలు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. “మేడ్ ఇన్ అమరావతి” విధానంతో క్వాంటం కంప్యూటర్ పరికరాల ఉత్పత్తికి విస్తృత ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటింగ్ పాలసీని అమలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఇప్పటికే క్వాంటం టెక్నాలజీ ప్రయాణాన్ని ప్రారంభించినట్టు అధికారులు గుర్తు చేశారు.
ఈ సమావేశం ఏపీని క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌లో దేశపు నాయకుడిగా మార్చడంలో కీలకమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మేధా టవర్స్‌లో ప్రారంభమైన క్వాంటం మిషన్ కార్యాలయం రాష్ట్రం క్వాంటం ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా మారనుంది.

