అమరావతి ప్రయాణం అన్‌స్టాపబుల్ : సీఎం చంద్రబాబు
x

అమరావతి ప్రయాణం 'అన్‌స్టాపబుల్' : సీఎం చంద్రబాబు

ఆరు నెలల్లోనే ‘క్వాంటం కంప్యూటర్’ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం విజయవాడ పీబీ సిద్ధార్థ అకాడమీ 50 వసంతాల వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అమరావతి భవిష్యత్తు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. కొందరు అసూయతో అమరావతిని ఆపాలని చూస్తున్నారని, కానీ ఈ 'ప్రజా రాజధాని' ప్రయాణం 'అన్‌స్టాపబుల్' అని తేల్చిచెప్పారు. విజయవాడను 'విద్యల వాడ'గా మార్చడంలో సిద్ధార్థ అకాడమీ కృషి అనిర్వచనీయమని కొనియాడారు. 18 కళాశాలల ద్వారా 28 వేల మందిని తీర్చిదిద్దుతున్న ఈ సంస్థ, అగ్రిటెక్ కళాశాల ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భవనాలు ఇచ్చిన సంస్థ ఉదారతను అభినందించారు. కేంద్రం ప్రకటించిన క్వాంటం మిషన్‌ను అందిపుచ్చుకుని, అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే నాలుగేళ్లలో ఇక్కడే క్వాంటం కంప్యూటర్ల తయారీ కూడా జరుగుతుంది.

విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. తిరుపతిలో 'స్పేస్ సిటీ', కర్నూలులో 'డ్రోన్ సిటీ' ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సెమీ కండక్టర్, డిఫెన్స్ పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయి. అమరావతి నదీ తీరంలో ఉందని ఆరోపించే వారికి.. ముంబై, లండన్, ఢిల్లీ నగరాలు ఎక్కడున్నాయో తెలియదా? అని ప్రశ్నించారు. ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికత వెలుస్తుంది. పవిత్ర జలాలు, మట్టితో నిర్మించిన అమరావతిని ఎవరూ ఆపలేరు అని ధ్వజమెత్తారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసి భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యుత్తమ 'లివబుల్ సిటీ'గా మారుతాయని చెప్పారు.

క్వాంటం అల్గారిథమ్స్ నేర్పేందుకు ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తామని, గ్లోబల్ యూనివర్సిటీల క్యాంపస్‌లను అమరావతికి తీసుకొస్తామని బాబు వివరించారు. 'మెగా పేరెంట్ టీచర్' సమావేశాల ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుసంధానం పెంచుతున్నట్లు తెలిపారు. గతంలో ఐటీని ప్రోత్సహించాం.. ఇప్పుడు ఏఐ (AI), క్వాంటంను ప్రోత్సహిస్తున్నాం. తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరు. వికసిత్ భారత్‌లో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకుంటామని, టెక్నాలజీ ద్వారా పాలనను పౌరులకు చేరువ చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సిద్ధార్థ అకాడమీ ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More
Next Story