అమరావతిలో అన్నదాతల ఆత్మఘోష
x

అమరావతిలో అన్నదాతల ఆత్మఘోష

సీఎం చంద్రబాబు అమరావతి ప్రయాణం అన్‌స్టాపబుల్ అంటున్నారు. రైతులేమో తమ త్యాగాలకు రక్షణ లేకుండా పోయిందంటున్నారు.


అమరావతి.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల నగరం. కానీ ఆ నగరం కోసం వేలాది ఎకరాల పచ్చని పొలాలను త్యాగం చేసిన రైతుల కళ్లలో మాత్రం నేటికీ కన్నీళ్లు సుడులు తిరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో అణచివేతకు గురైన తాము, తమ ప్రభుత్వం (కూటమి) రాగానే విముక్తి కలుగుతుందని ఆశించిన రైతులకు ఇప్పుడు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టి 18 నెలలు గడుస్తున్నా, రాజధానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంలోనూ, తమ ఆర్థిక కష్టాలు తీర్చడంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంపై రైతులు మండిపడుతున్నారు. పాలకులు మారినా తమ బతుకు చిత్రంలో మార్పు రాలేదని, నమ్మిన వ్యక్తులే తమను నట్టేట ముంచుతున్నారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిని రాజధానిగా నిలబెట్టుకోవడానికి ఐదేళ్ల పాటు ఎండనక, వాననక వీరోచితంగా పోరాడిన రైతులకు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా నిరాశే ఎదురవుతోంది. తమ కష్టాలు తీరుస్తారని నమ్మిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికార పీఠం దక్కాక తమ ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ చూపిస్తూ కాలయాపన చేయడం తప్ప, రాజధానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంలోనూ, అభివృద్ధి జాప్యంపై పరిహారం చెల్లించే హామీ ఇవ్వడంలోనూ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. పాలకులు మారినా తమ తలరాతలు మారడం లేదని, నాడు జగన్ పాలనలో అవమానాలు ఎదుర్కొంటే.. నేడు సొంత ప్రభుత్వం అని నమ్ముకున్న కూటమి పాలనలో 'ఉపేక్ష'ను ఎదుర్కోవాల్సి వస్తోందని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యలు:

రుణాల ఉరితాడు - బ్యాంకుల వేధింపులు: భూములిచ్చే నాటి పాత పంట రుణాలు ఇప్పటికీ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. దీనివల్ల రైతుల సిబిల్ స్కోర్ (CIBIL) దెబ్బతిని కొత్త అప్పులు పుట్టడం లేదు. క్లియరెన్స్ లేక ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని వెంటనే మాఫీ చేయాలని రైతులు పట్టుబడుతున్నారు.

చట్టపరమైన రక్షణ (Legal Guarantee): రాజధాని హోదాను కేవలం ప్రభుత్వ జీఓల ద్వారా కాకుండా, కేంద్ర చట్టం ద్వారా లేదా అసెంబ్లీలో బలమైన చట్టం ద్వారా శాశ్వతం చేయాలని కోరుతున్నారు. భవిష్యత్తులో రాజకీయ మార్పులు వచ్చినా ప్రాజెక్టు ఆగకూడదన్నది వారి ప్రధాన డిమాండ్.

ప్లాట్ల కేటాయింపులో లోపాలు: తమకు కేటాయించిన ప్లాట్లు కొన్ని చెరువులు, వాగులు, పల్లపు ప్రాంతాల్లో ఉన్నాయని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. కనీసం వాకింగ్ చేయడానికి కూడా పనికిరాని ఆ ప్లాట్లు అమ్మకానికి పనికిరావని, వాటిని మార్చాలని కోరుతున్నారు.

కౌలు (Annuity) పెంపు: 2015 నాటి ధరల ప్రకారం ఎకరాకు ఇచ్చే ₹30,000-₹50,000 కౌలు ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని కనీసం ₹60,000 కు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

జాప్యానికి పరిహారం: ఒప్పందం ప్రకారం 3 ఏళ్లలో ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా 11 ఏళ్లు గడిచినా మౌలిక వసతులు లేవు. ఈ జాప్యానికి పరిహారంగా ఎకరాకు ఏడాదికి ₹5 లక్షల చొప్పున జరిమానాను ఒప్పందంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల లేమి: ఐకానిక్ భవనాల మీద ఉన్న శ్రద్ధ గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలపై లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు రోడ్లపైకి వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని గ్రామ సభల్లో నిలదీస్తున్నారు.

నిరుద్యోగం - సామాజిక భద్రత: వ్యవసాయం పోవడంతో యువతకు ఉపాధి లేకుండా పోయింది. కేవలం ప్లాట్లు ఇవ్వడమే కాకుండా, ఐటీ హబ్‌లు, స్కిల్ సెంటర్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతిని "అన్‌స్టాపబుల్" అని ప్రచారం చేస్తోంది. అమరావతి ప్రయాణం "అన్‌స్టాపబుల్" అని శనివారం విజయవాడ పీబీ సిద్ధార్ధ విద్య సంస్థల స్వర్ణోత్సవా కార్యక్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తానికి, అమరావతి రైతుల పోరాటం కేవలం భూముల కోసం మాత్రమే కాదు, తమ ఆత్మగౌరవం, భవిష్యత్తు భద్రత కోసం. 'కూటమి ప్రభుత్వం మా సొంత ప్రభుత్వం' అని నమ్మి ఓట్లేసిన రైతులకు, ఇప్పుడు అదే ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీలు లభించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కేవలం శంకుస్థాపనలు, ప్రకటనలతో కాలం గడిపేయకుండా.. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు. రాజధాని కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన తమకు, ఇప్పుడు పాలకుల 'నిర్లక్ష్యం' శాపంగా మారకూడదని ఆకాంక్షిస్తున్నారు. మరి, రైతుల కన్నీళ్లను తుడిచి వారికి చట్టబద్ధమైన భరోసాను ఈ ప్రభుత్వం ఇస్తుందో లేదో వేచి చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read More
Next Story