
ఇక కాంట్రాక్టర్లకు కావాల్సినంత మట్టి, ఇసుక, కంకర!
యథేచ్ఛగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్లేలా భూగర్భ వనరులు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు
రాజధాని అమరావతి పనుల పురోగతిలో అంతర్భాగమైన కాంట్రాక్టర్ల పంట పడింది. వాళ్లు అడిగినంత కంకర , ఇసుక, మట్టి వంటివి సులభరీతిన లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని భూగర్భ వనరులు, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి , తిరుపతి ఆర్ధిక మండలి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అదేశాల మేరకు అన్ని రకాల మైనింగ్ అనుమతుల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, నిబంధనల సరళీకరణను చేపట్టామన్నారు. సిఆర్డీఎతో కలిసి అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉన్న ఎల్ అండ్ టి, మేఘా, ఎన్ సిసి, బిఎస్ సిపిఎల్, ఆర్ విఆర్ సంస్ధల ప్రతినిధులతో మీనా మంగళవారం సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ఆకాంక్షల మేరకు సాధ్యమైనంత తక్కువ దూరంలోనే ఈ వనరులు లభించేలా చర్యలు చేపట్టామన్నారు.
రానున్న రోజుల్లో ఇంకా ఎంతమేర గ్రావెల్ , మట్టి, ఇసుక వంటివి అవసరం అవుతాయన్న దానిపై అంచనాలు సమర్పిస్తే తదనుగుణంగా ప్రణాళిక సిద్దం చేస్తామని వివరించారు. కృష్ణా జిల్లాలో అటవీ అనుమతుల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు మీనా దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ బాలాజీ నుండి వివరాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్ధితులలోనూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపవలసిందేనని, సమస్యల పేరిట పనులు ఆగేందుకు వీలు లేదని స్పష్టం చేసారు. కలెక్టర్ల సదస్సులో సిఎం ఏమి సూచించారన్న దానిని పరిగణన లోకి తీసుకోవాలని, సమస్యలకు పరిష్కారం చూపేందుకే మనం ఉన్నామన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.
సిఆర్ డిఎ కమీషనర్ కన్నబాబు మాట్లాడుతూ మంచి మెటిరియల్ లభించాలంటే కొన్ని సందర్భాలతో దూరం వెళ్లవలసి రావొచ్చని, అటువంటి సమయాల్లో కాంట్రాక్టర్లకు సహకరించాలని తెలిపారు.
దీనిపై కాంట్రాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తూ.. గతంతో పోల్చితే అనుమతులు వేగవంతం అయ్యాయన్నారు. తమకు అవసరమైన కేటాయింపులు జరుగుతున్నాయని వివరించారు.
సమావేశంలో భూగర్భ వనరులు, గనుల శాఖ సంచాలకులు చంద్రశేఖర్ , సమీప జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ హైబ్రిడ్ సమావేశంలో పాల్లొన్నారు.
Next Story

