
రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమరావతి చట్టబద్ధత బిల్లు
ఎటువంటి సవరణలు లేకుండానే ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలపాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026 సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. లోక్‌సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడంతో, ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడనుంది.
పార్లమెంట్‌లో ఏకగ్రీవ ఆమోదం
ఇటీవల పార్లమెంట్‌లో ఈ బిల్లుపై సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాధాన్యతను సభకు వివరించింది. ఎటువంటి సవరణలు లేకుండానే ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలపడం విశేషం. ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన ఈ చర్చ అనంతరం లోక్‌సభ సచివాలయం తుది ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రపతికి నివేదించింది.
రాష్ట్రపతి సంతకమే తరువాయి
ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేయనున్నారు. సోమవారం సాయంత్రం లోపు లేదా రేపటిలోగా రాష్ట్రపతి సంతకం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది.
త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్
రాష్ట్రపతి సంతకం పూర్తయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం హిందీ , ఆంగ్ల భాషల్లో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనితో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు అమలులోకి వస్తాయి. అమరావతికి చట్టబద్ధమైన రక్షణ లభించడంతో పాటు, రాజధాని నిర్మాణ పనులకు మరింత ఊతం లభిస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
Next Story

