హైదరాబాద్‌కు మించి అమరావతి
x

హైదరాబాద్‌కు మించి అమరావతి

ఏఐ, డ్రోన్ టెక్నాలజీతో స్మార్ట్ సిటీగా అమరావతి నిర్మాణం.


నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన మాదిరిగానే, నేడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతకంటే మిన్నగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు అత్యంత అధునాతన సాంకేతికతతో అమరావతిని ఒక గ్లోబల్ స్మార్ట్ సిటీ గా మారుస్తామని భరోసా ఇచ్చారు. ఏఐ (AI), డేటా సెంటర్లు, క్వాంటం మరియు స్పేస్ టెక్నాలజీ వంటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మాణం సాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఈవో సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026, ట్రాన్స్ ఫార్మింగ్ ఏఐ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అంశంపై సీఎం అభిప్రాయాలను పంచుకున్నారు.

నాడు బిల్‌గేట్స్‌ను ఒప్పించి.. ఐటీకి పునాది వేసి..
తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. 1990వ దశకంలో ఇంటర్నెట్ విప్లవం ప్రారంభమైనప్పుడే తాను ఐటీ రంగంపై దృష్టి సారించానని చంద్రబాబు తెలిపారు. అప్పట్లో ఢిల్లీ వెళ్లి మరీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను కలిశాను. భారతీయులకు లెక్కలు, ఇంగ్లీష్‌పై ఉన్న పట్టును వివరించి, హైదరాబాద్‌లో ఐటీ కార్యాలయం పెట్టేలా ఒప్పించాను అని ఆయన గుర్తు చేశారు. తొలుత నిరాకరించినప్పటికీ, ఇక్కడ కల్పించే ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలను వివరించి మైక్రోసాఫ్ట్‌ను రప్పించడమే కాకుండా.. ఐఎస్‌బీ, నల్సార్, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తీరును వివరించారు.
అభివృద్ధి - సంక్షేమమే మా మంత్రం
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని, 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడితే రాజకీయంగా సవాళ్లు ఎదురవుతాయని తన గత అనుభవాల ద్వారా నేర్చుకున్నానని, అందుకే ఇప్పుడు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏపీ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ, ఎయిర్ అంబులెన్స్‌ల వాడకాన్ని విపరీతంగా పెంచుతామని వెల్లడించారు.
గ్రీన్ ఎనర్జీలో ఏపీ నెంబర్ వన్
విద్యుత్ రంగాన్ని సంస్కరించి మిగులు విద్యుత్ సాధించడమే కాకుండా.. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని చంద్రబాబు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందని ఆయన గర్వంగా ప్రకటించారు. భవిష్యత్తులో సాంకేతిక విప్లవానికి అమరావతి కేంద్రం కావాలన్నదే తన లక్ష్యమని, దీనికోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Read More
Next Story