మళ్లీ డిసెంబరులో ‘అమరావతి ఆవకాయ్’
x

మళ్లీ డిసెంబరులో ‘అమరావతి ఆవకాయ్’

తెలుగు సంస్కృతి, రుచులు, కళల ప్రతిబింబమైన అమరావతి ఆవకాయ్ ఉత్సవాలు శనివారం సాయంత్రం వైభవోపేతంగా సమాప్తమయ్యాయి. నంది అవార్డులు మొదలు కానున్నాయి.


విజయవాడలోని కృష్ణాతీరంలో ఉన్న పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ లలో మూడు రోజులు సాగిన వేడుకలకు ప్రజలు అపూర్వంగా స్పందించారు. ముగింపు సమావేశంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ ను బ్రాండ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుతామని తెలిపారు. ఈ క్రమంలో 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీలు అమరావతి ఆవకాయ్ ఉత్సవాలను తిరిగి నిర్వహించేందుకు నిర్ణయించామని ఆయన చెప్పారు.

నంది అవార్డులు పునరుద్ధరణ

గత ప్రభుత్వాల కాలంలో కళలు, సంస్కృతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కళాకారులకు ప్రాధాన్యం ఇస్తూ కందుకూరి ఉగాది పురస్కారాలు అందజేశామని మంత్రి కందుల దుర్గేష్ గుర్తుచేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో నంది నాటకోత్సవాలు ఏర్పాటు చేసి ప్రతిభావంతులకు నంది అవార్డులు ప్రదానం చేస్తామని స్పష్టత నిచ్చారు.

టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంస్థ నాటకం సినిమా సాహిత్యం విభిన్న ప్రదర్శనలను ఒకే వేదికకు తీసుకురావడాన్ని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై చర్చా కార్యక్రమం, సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్న సాహిత్యం-సినిమా చర్చలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ కురుక్షేత్ర పద్యాల ఆలాపన ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెంట్రిలాక్విజం ప్రదర్శనలు యువతను పిల్లలను ఆనంద పరిచినట్లు మంత్రి దుర్గేష్ ప్రకటించారు.

మనలో దాగి ఉన్న ప్రతిభ కళలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని దుర్గేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాల ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకొని అధికారిక పండుగలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల కోనసీమ జగ్గన్నతోటలో ప్రభల తీర్థం రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషకరమని ఆయన ఉదాహరించారు. రాష్ట్రంలో ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు కవులు తదితరుల జయంతులు వర్ధంతులు జరుపుకొని ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని ఆయన గుర్తుచేశారు.

మూడు రోజులలో భవానీ ఐలాండ్ కు 15 వేల మంది పున్నమి ఘాట్ కు 30 వేల మంది మొత్తం 45 వేల మందికి పైగా సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

అమరావతిని ప్రజారాజధానిగా ఆవకాయను ఆంధ్రుల ప్రత్యేక రుచిగా వర్ణిస్తూ జీవితంలో నవరసాల సమ్మేళనమే ఈ ఫెస్టివల్ అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులు టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read More
Next Story