’ఫైనాన్షియల్ హబ్‘గా అమరావతి : సీఎం చంద్రబాబు
x

’ఫైనాన్షియల్ హబ్‘గా అమరావతి : సీఎం చంద్రబాబు

వడ్డీ వ్యాపారుల చెర నుంచి పేదలను విడిపించాలి.. డ్వాక్రా తరహాలోనే ఎఫ్‌పీఓల బలోపేతం చేయాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి ’ఫైనాన్షియల్ హబ్‘గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే నేరుగా బ్యాంకర్ల సమావేశానికి హాజరైన సీఎం, వార్షిక రుణ ప్రణాళికతో పాటు పలు కీలక రంగాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

ప్రైవేట్ రుణాలకు కాలం చెల్లాలి

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయం లేదా మరే ఇతర అవసరానికైనా బ్యాంకులు తలుపులు తట్టేలా వ్యవస్థ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని పిలుపునిచ్చారు.

డ్వాక్రా తరహాలో ఎఫ్‌పీఓలు..టిడ్కో ఇళ్లకు సహకారం

డ్వాక్రా సంఘాలను ప్రపంచానికే ఆదర్శంగా నిలిపిన తరహాలోనే, ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను (FPO) బలోపేతం చేయాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం వల్ల ఇబ్బందుల్లో పడ్డ టిడ్కో లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని, డ్వాక్రా ఖాతాలపై విధిస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నవకల్పనలకు బ్యాంకుల దన్ను

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికేలా ఏర్పాటు చేస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లకు దేశంలోని ప్రముఖ బ్యాంకులు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అమరావతిలోని ప్రధాన కార్యాలయానికి (Main Hub) యూనియన్ బ్యాంక్ మద్దతు ఇస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పోక్ హబ్‌లకు ఒక్కో ప్రముఖ బ్యాంక్ సహకారాన్ని అందిస్తోంది. రాజమండ్రి హబ్‌కు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, అనంతపురానికి కెనరా బ్యాంక్, విశాఖపట్నానికి పీఎన్బీ (PNB), తిరుపతికి ఇండియన్ బ్యాంక్, విజయవాడ కేంద్రానికి హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకులు బాధ్యత తీసుకున్నాయి. ఈ బ్యాంకుల సహకారంతో పరిశ్రమలు స్థాపించే యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు సాంకేతిక మద్దతు కూడా లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రీన్ ఎనర్జీ, క్యూఆర్ రికార్డులు.. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ దిశగా అడుగులు

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు కీలక సూత్రాలను బ్యాంకర్ల ముందుంచారు. ముందుగా, పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన స్వయంసమృద్ధి కోసం రెన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధన) రంగానికి బ్యాంకర్లు ఉదారంగా రుణాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రభుత్వం తరపున డిస్కంలు కౌంటర్ గ్యారెంటీ ఇస్తాయని భరోసా ఇచ్చారు. ఇక భూ రికార్డుల విషయంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, వివాదాలకు తావులేకుండా క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తున్నామని.. ఇదే సాంకేతికతను బ్యాంక్ ఖాతాలకు కూడా అనుసంధానించేలా బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. అన్నింటికంటే ముఖ్యంగా, రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యానికి ఎంఎస్ఎంఈ (MSME) రంగమే వెన్నెముక అని, బలహీన వర్గాలకు అండగా నిలిచే ఈ చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకులు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story