ఆవకాడోపై ‘అల్లూరి’ రైతుల అమితాసక్తి!
x
అల్లూరి జిల్లాలో సాగవుతున్న ఆవకాడో పంట

ఆవకాడోపై ‘అల్లూరి’ రైతుల అమితాసక్తి!

అత్యంత అరుదుగా సాగయ్యే ఆవకాడో పంటపై అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు ఆసక్తి పెంచుకుంటున్నారు.

అక్కడెక్కడో విదేశాల్లో విరివిగా సాగయ్యే ఆవకాడో పంట ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వేళ్లూనుకుంటోంది. రెండు మూడేళ్ల క్రితం పాతిక ఎకరాలకు మించని ఈ సాగు ఇప్పుడు పది రెట్లకు మించిందంటే గిరిజన రైతులు ఈ పంట పట్ల ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతుంది. ఒకపక్క మంచి దిగుబడి, మరోపక్క మంచి ధరతో లాభాల రుచి చూస్తుండడంతో ఆవకాడో పంట గిరి రైతుల మనసును దోచుకుంటోంది.


చెట్ల నుంచి కోసిన ఆవకాడో కాయలు

ఆవకాడో సాగుపై పెరుగుతున్న ఆసక్తి..
ఆరోగ్యానికి మేలు చేసే ఆవకాడో పండు ధర ఎగువ మధ్య తరగతి, ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలోని తూర్పు హిమాలయ ప్రాంతం, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లోని కొన్ని చోట్లే ఇది సాగవుతోంది. అలాంటి ఆవకాడో సాగుకు అల్లూరి జిల్లా అనువుగా ఉందన్న విషయం కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయోగాత్మకంగా కొద్దిమంది రైతులతో ఉద్యానశాఖ అధికారులు ఆవకాడో సాగుకు శ్రీకారం చుట్టారు. మొదట్లో గిరి రైతులు అంతగా ఈ పంటపై మొగ్గు చూపలేదు. క్రమంగా ఆవకాడో పంటకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండడం, ఆశించిన స్థాయిలో ఉద్యాన శాఖ నుంచి ప్రోత్సాహం లభించడం, ఈ పండ్ల కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం వంటివి ఈ రైతుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఆవకాడో పండు

ఆవకాడో ప్రవేశం అలా జరిగింది..
అల్లూరి జిల్లాలోకి ఈ ఆవకాడో ప్రవేశం అనూహ్యంగా జరిగింది. ఇరవయ్యేళ్ల క్రితం అప్పటి కాఫీ బోర్డు అధికారి ఒకరు కాఫీ తోటల్లో నీడనిచ్చే చెట్లుగా వీటిని కర్నాటక నుంచి రప్పించారు. అప్పట్లో ఆవకాడో పండ్లకు అంతగా గిరాకీ లేదు. చాలా మందికి వాటి గురించి తెలియనే తెలియదు. అలా అప్పట్లో నాటిన ఆవకాడో చెట్లు ఫలాలనివ్వడం మొదలెట్టాయి. వాటి గురించి క్రమంగా గిరి రైతులకు తెలిసొచ్చింది.
25 ఎకరాల నుంచి 250 ఎకరాలకు..
అసలు ఆవకాడో అంటే ఏమిటో తెలియని గిరి రైతులు తొలుత పదేళ్ల క్రితం అల్లూరి జిల్లాలోని చింతపల్లి మండలం గొందిపాకలు, పెద్దరబడ గ్రామాల్లో దాని సాగును మొదలు పెట్టారు. పొడి వాతావరణం, తక్కువ నీరు, ఎర్ర ఇసుక నేల దీనికి అవసరం. రెండు మూడేళ్ల క్రితం వరకు కేవలం 25 ఎకరాలకే పరిమితమైన ఆవకాడో సాగు ప్రస్తుతం 250 ఎకరాలకు విస్తరించింది. దీనిని ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పెంచాలని ఉద్యానశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాయితీతో ఆవకాడోకు ప్రోత్సాహం..
ఆవకాడో సాగును విస్తృతం చేయడానికి ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. హెక్టారు సాగుకు సుమారు రూ.లక్షా 20 వేల ఖర్చవుతుంది. ఇందులో తొలి ఏడాది రూ.30 వేలు, రెండో సంవత్సరం రూ.20 వేలు వెరసి 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇది గిరి రైతుకు బాసటగా నిలుస్తోంది. ఆవకాడో మొక్కను నాటిన ఐదారేళ్లకు సమృద్ధిగా కాపుకొస్తాయి. కోసిన పది రోజుల్లో పండుతాయి. రైతులు ఆవకాడో సాగును రసాయన ఎరువులకు దూరంగా పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే చేస్తున్నారు.
కిలో ఆవకాడో రూ.150కు కొనుగోలు..
అల్లూరి జిల్లాలో ప్రస్తుతం వెస్టిండియన్‌ ఆవకాడో, పింకర్‌టన్, హాస్, రీడ్‌ (రౌండ్‌వి) వంటి రకాలు సాగవుతున్నాయి. గతంలో అల్లూరి జిల్లాలో పండించిన ఆవకాడోకు సగటున కిలో రూ.100 ధర పలికేది. ఇప్పుడు వ్యాపారులు రూ.150కి కొనుగోలు చేస్తున్నారు. కిలోకు మూడు నాలుగు కాయలు తూగుతాయి. పదేళ్ల వయసున్న చెట్టుకు సగటున 200, ఐదారేళ్ల వయసు చెట్లకు 100–150 వరకు దిగుబడినిస్తాయి. ‘ఐదేళ్నుంచి ఆవకాడో పండిత్తనాను. పెట్టుబడి పోను ఏటా ఎకరానికి లచ్చ దాకా లాబం మిగుల్తానాది. అంతుకే మా రైతులు ఈ పంట మీద మొగ్గు సూపుతనారు’ అని ఆవకాడో సాగు చేస్తున్న పెదరబడ రైతు కిలో సంజీవ్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పాడు.
ఆవకాడోకు డిమాండ్‌ అదరహో..
ఆరోగ్యానికి మేలు చేసే ఆవకాడోపై ప్రజల్లో కొంతకాలంగా అవగాహన పెరుగుతోంది. దేశంలో దీని సాగు అంతంతమాత్రం కావడంతో విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. మార్కెట్లో విదేశీ ఆవకాడో పండ్లు రకాన్ని బట్టి కిలో రూ.600–800 వరకు ఉంటోంది. అదే దేశీయ ఆవకాడో ధర 300–500 మధ్య ఉంది. దీంతో వ్యాపారులు అల్లూరి జిల్లాలో పండిన ఆవకాడోను కిలో రూ.150కి కొనుగోలు చేసి మార్కెట్లో రూ.300–500 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు నేరుగా గిరిజన రైతుల వద్దకే వెళ్లి కొంటున్నారు. వెనువెంటనే చెల్లింపులు చేస్తున్నారు. మరికొందరు రైతులు సమీపంలోని విశాఖతో పాటు విజయవాడ, హైదరాబాద్‌ నగరాలకు తీసుకెళ్లి అమ్మకాలు చేసుకుంటున్నారు. అందువల్ల ఈ రైతులకు ఇతర పంటలు, ఉత్పత్తుల మాదిరిగా ఆవకాడోకు మార్కెటింగ్‌ సమస్య తలెత్తడం లేదు. పైగా ఇతర ప్రాంతాలకంటే ఇక్కడ పండే ఆవకాడో పండ్ల సైజు కూడా పెద్దవే. అంతేకాదు.. గుడ్‌ ఫ్యాట్‌ అధికంగా ఉండే హాస్‌ రకం ఆవకాడో ఎక్కువగా అల్లూరి జిల్లాలోనే సాగవుతోంది.

కేబీ కర్ణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి

జిల్లా అంతటికీ విస్తరిస్తున్నాం..
‘అల్లూరి జిల్లాలో ఆవకాడో సాగుపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏటా ఈ రైతుల సంఖ్య పెరుగుతోంది. 2024–25 సంవత్సరంలో జిల్లాలో 25 ఎకరాలే ఆవకాడో సాగు జరిగేది. 2025–26కి ఆ సంఖ్య 256 ఎకరాలకు పెరిగింది. ఈ సంవత్సరం జిల్లా అంతటికీ విస్తరించి వెయ్యి ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పంటను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు రూ.50 వేల వరకు సబ్సడీ ఇస్తోంది. రైతులు ఆవకాడోపై రోజురోజుకు అవగాహన పెంచుకుంటున్నారు. వారిని మాతో పాటు చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నాం. ఆవకాడో సాగు లాభసాటి కావడంతో రైతులు ముందుకొస్తున్నారు. రైతుల పండించిన ఆవకాడోకు మార్కెటింగ్‌ సమస్య లేనేలేదు. నేరుగా వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.బి.కర్ణ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story