
ఏపీ ప్రజలకు అలర్ట్..పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ కీలక హెచ్చరిక.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆరెంజ్ అలర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని, ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని అధికారులు గట్టిగా హెచ్చరించారు.
ఎల్లో అలర్ట్..అప్రమత్తంగా ఉండాల్సిన మరికొన్ని జిల్లాలు
మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం తక్కువగా ఉన్నా, ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
విపత్తుల సంస్థ కీలక సూచనలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఉరుములు, మెరుపులు మొదలైన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, పక్కాగా ఉన్న సురక్షితమైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలి. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడటం అత్యంత ప్రమాదకరమని, పొలాల్లో ఉన్న రైతులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్నప్పుడు టీవీలు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించాలి. విద్యుత్ ఉపకరణాలను ప్లగ్ పాయింట్ల నుంచి తొలగించడం మంచిదని సూచించారు.
Next Story

