పండగపూటా గుక్కెడు మందు తాగనీయరా? మందుబాబుల లబోదిబో!
x

పండగపూటా గుక్కెడు మందు తాగనీయరా? మందుబాబుల లబోదిబో!

పెరిగిన మద్యం ధరలు, పండక్కి ముందే సరకు బ్లాక్


ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులు లబోదిబోమంటున్నారు. ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడానికి రెండు రోజుల ముందు నుంచే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మద్యం బాటిల్ కి రూ.10 పెంచాలని ఈనెల 8న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దీనికి ముందు నుంచే లిక్కర్ షాపుల వాళ్లు బాటిల్ కి అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. ఎక్కువగా అమ్ముడయ్యే సరుకును దాచేసి ఎక్కువ రేట్లకు విక్రయించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు.

"ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తానన్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచిందని, క్వార్టర్ మాన్షన్ హౌస్ మందు రూ.210 నుంచి 225 వరకు అమ్ముతున్నారని" విజయవాడకు సమీపంలోని ఈడుపుగల్లు వాసి రామనరసింహారావు వాపోయారు. ఇదే రకం మద్యం తెలంగాణలో రూ.180కి అమ్ముతున్నారని చెప్పారు. ఇది అన్యాయమన్నది నరసింహారావు వాదన.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో బాటిల్‌పై రూ.10 పెంచారు. ఇప్పుడు మరో రూ.10 పెంచారు. సంక్రాంతి పండుగకు ముందు ధర పెరగడం వినియోగదారుల్లో కలకలం రేపింది. దీంతో ఏడాదికి రూ.1,391 కోట్లు మందు బాబులపై భారం పడనుంది.
మద్యం ధరల పెంపు ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల దేశీ తయారీ విదేశీ మద్యం (IMFL), విదేశీ మద్యం బాటిళ్లపై ₹10 గరిష్ట రిటైల్ ధర (MRP)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తక్కువ ధర కలిగిన మద్యం అంటే ₹99 కి లభించే 180 ml బాటిళ్లపై ఈ పెంపు వర్తించదు. బీర్, వైన్, రెడీ-టు-డ్రింక్ (RTD) ఉత్పత్తులపై కూడా ఈ ధరల పెంపు ఉండదు.
ముఖ్యమైన మార్పులు...
బార్లలో గతంలో ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల బార్లకు ఏడాదికి సుమారు ₹340 కోట్ల ఉపశమనం లభిస్తుందని అంచనా.
రిటైల్ షాపులకు, బార్లకు మధ్య ధరల్లో ఉన్న వ్యత్యాసాలను తొలగించి, ధరల సమానత్వం తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని మంత్రి కె. పార్థసారథి తెలిపారు. మద్యం వ్యాపారుల మార్జిన్‌ను MRP లో సుమారు 1% పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ MRP సవరణ వల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు ₹1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
2024 అక్టోబర్లో పెద్ద ఎక్సైజ్ పాలసీ మార్పు, సర్కారీ దుకాణాలు మూత
2024 నవంబర్ లో బాటిల్ కి రూ.10 పెంపు
2025లో ప్రైవేట్ మద్యం దుకాణాల ప్రవేశం
2026 జనవరి 9న ఒకసారి బాటిల్ ధరలు ₹10 పెరిగాయి
మైక్రోబ్రూవరీల విస్తరణ
రాష్ట్రంలో పర్యాటక రంగం, పెట్టుబడులను ప్రోత్సహించడానికి మైక్రోబ్రూవరీల నిబంధనలను ప్రభుత్వం సడలించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిమితులతో పాటు, వాటికి 5 కిలోమీటర్ల పరిధిలో కూడా మైక్రోబ్రూవరీలకు అనుమతినిస్తారు. నోటిఫైడ్ పర్యాటక కేంద్రాలు, త్రీ స్టార్, అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న హోటళ్లలో ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
లిక్కర్ సిండికేట్ల వత్తిడే కారణమా..
లిక్కర్‌ సిండికేట్‌ వత్తిడితోనే బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించేలా నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపించింది. దీంతో.. ఏడాదికి 340 కోట్లు బార్ల సిండికేట్‌కి లబ్ధి చేకూరనుంది. గత చంద్రబాబు పాలనలోనూ.. ప్రివిలైజ్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ దఫా కూటమి ప్రభుత్వంలో ఏఆర్ఈటీని రద్దు చేశారు.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్ల పెంపు ఒక నిర్ణయం కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
Read More
Next Story