
శంకరాచార్య వ్యాఖ్యలపై సీఎం యోగిపై అఖిలేష్ విమర్శలు
శంకరాచార్యపై అవమానకరమైన భాష ఉపయోగించడం ‘మౌఖిక హింస’ తో సమానమని, మతపర అంశాలపై ద్వేషపూరిత రాజకీయాలు చేయడం తగదన్న మాజీ సీఎం
శంకరాచార్యపై అవమానకరమైన భాష వాడడం.. మౌఖిక హింస (‘శాబ్దిక్ హింసా’)తో సమానమని, అది పాపమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ శనివారం వ్యాఖ్యానించారు. శంకరాచార్యపై అత్యంత అవమానకరమైన భాష ఉపయోగించిన వ్యక్తితో పాటు, సభలో అటువంటి వ్యాఖ్యలకు మద్దతుగా బల్లలు కొట్టిన వారూ దోషులేనని అన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ “శంకరాచార్య” అనే బిరుదును ఉపయోగించుకునే అర్హత కలిగి ఉండరని, మతపరమైన కార్యక్రమాల్లో మర్యాదలు, చట్ట నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా చేసిన ఈ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.
మహా కుంభమేళాలో మరణాల అసలు గణాంకాలను వెల్లడించని వారు, పరిహారం చెల్లింపుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, ఇతరుల మతపరమైన స్థితిని ప్రశ్నించే నైతిక హక్కు వారికి లేదని అఖిలేష్ అన్నారు. “చట్ట పాలన” గురించి మాట్లాడే వారు ముందుగా పారదర్శకత పాటించాలని ఆయన వ్యాఖ్యానించారు. అహంకారం మాట్లాడితే సంస్కృతి దెబ్బతింటుందని, సమాజంలో గౌరవం కోల్పోతారని కూడా విమర్శించారు.
శంకరాచార్యపై చేసిన “అసభ్యకర” వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల్లో శాశ్వతంగా నమోదైపోయాయని, వాటిని ఖండించదగినవి అని చెప్పడం కూడా సరిపోదని అఖిలేష్ అన్నారు. మతపరమైన అంశాలపై కూడా ద్వేషపూరిత రాజకీయాలు చేయడం సరికాదని ఆయన యోగి ఆదిత్యనాథ్‌పై ఆరోపించారు.
ఈ వివాదం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మాఘమేళా సందర్భంగా జిల్లా యంత్రాంగం, స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మధ్య జరిగిన సంఘటనల నేపథ్యంలో చర్చకు వచ్చింది. జనవరి 18న మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానానికి సంగం వైపు వెళ్తున్న సమయంలో స్వామిని ఆపిన ఘటనపై కూడా వివాదం నెలకొంది.
ఇక సీఎం యోగి ఆదిత్యనాథ్ మాఘమేళా నిర్వహణను సమర్థిస్తూ, ఒకే ప్రదేశంలో కోట్లాది మంది భక్తులు గుమిగూడినప్పుడు తొక్కిసలాట వంటి ప్రమాదాలు నివారించడానికి కఠినమైన జనసమూహ నియంత్రణ అవసరమని అన్నారు. స్నానం చేసిన తర్వాత బయటకు వెళ్లే మార్గాన్ని ప్రవేశ ద్వారంగా వాడకూడదని, అలా చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

