అజిత్ పవార్ విమాన ప్రమాదం: కుట్ర ఆరోపణలపై జీరో ఎఫ్ఐఆర్
x

అజిత్ పవార్ విమాన ప్రమాదం: కుట్ర ఆరోపణలపై జీరో ఎఫ్ఐఆర్

బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ రాజేంద్ర పవార్ ఫిర్యాదు..


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కొత్త వివాదం చెలరేగింది. ఈ ఘటన యాదృచ్ఛికం కాదని, భారీ కుట్ర జరిగిందని ఆయన మేనల్లుడు రోహిత్ రాజేంద్ర పవార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మార్చి 23న బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలో ఫిర్యాదు స్వీకరించకపోవడంతో అక్కడ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జనవరి 28న పూణే సమీపంలోని బారామతి విమానాశ్రయం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.

ప్రమాదానికి గురైన బాంబార్డియర్ లీర్‌జెట్ 45 విమానం ఎగరడానికి అనువుగా లేనిదని రోహిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విమానం ఇంజిన్ సామర్థ్యం 5వేల గంటలు కాగా, రికార్డుల్లో 4,915 గంటలు చూపించారని అయితే వాస్తవంగా అది విమానం 8వేల గంటలకు పైగా ప్రయాణించినట్లు పేర్కొన్నారు. విమానం రిజిస్ట్రేషన్‌కు ముందు ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికెట్ జారీ చేయడం కూడా అనుమానాస్పదంగా ఉందని, ఇందులో డీజీసీఏ స్థాయిలో అవినీతి జరిగి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.


సిబ్బంది మార్పుపై అనుమానం..

చివరి నిమిషంలో విమాన సిబ్బందిని మార్చడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ముందుగా నిర్ణయించిన సిబ్బందికి బదులుగా, గతంలో మద్యపాన కారణంగా సస్పెండ్ అయిన సుమిత్ కపూర్‌ను చీఫ్ పైలట్‌గా నియమించారని రాజేంద్ర పవార్ ఆరోపించారు. అలాగే ప్రమాద సమయంలో కో-పైలట్ శంభవి పాఠక్ భయంతో స్పందించినప్పటికీ, చీఫ్ పైలట్ స్పందించలేదని నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.


రన్‌వేలో మార్పుపై ..

ప్రమాద సమయంలో బారామతిలో దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ, విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతించారని ఆరోపించారు. కనీసం ఐదు కిలోమీటర్ల విజిబిలిటీ అవసరమైన చోట, రెండు కిలోమీటర్ల కంటే తక్కువ విజిబిలిటీ ఉన్నపుడు కూడా ల్యాండింగ్‌కు ప్రయత్నించారని తెలిపారు. చివరి నిమిషంలో సురక్షిత రన్‌వేకు బదులుగా ప్రమాదకరమైన టేబుల్‌టాప్ రన్‌వేకి మార్పు చేయడం ప్రమాదానికి కారణమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనలో అనుమానాస్పద అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేసును లోతుగా దర్యాప్తు జరపాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ కేసును అత్యవసరంగా పరిశీలించాలని కోరారు.

Read More
Next Story