ప్రత్యామ్నాయ విద్యావిధాన ప్రణాళిక విడుదల
x

ప్రత్యామ్నాయ విద్యావిధాన ప్రణాళిక విడుదల

లోపభూయిష్టమైన నూతన జాతీయ విద్యావిధానం-2020కి ప్రత్యామ్నాయంగా ప్రజావిద్యావిధాన ప్రణాళికను అఖిల భారత విద్యాపరిరక్షణ కమిటి విడుదల చేసింది.


-రాఘవశర్మ


లోపభూయిష్టమైన నూతన జాతీయ విద్యావిధానం-2020కి ప్రత్యామ్నాయంగా ప్రజావిద్యావిధాన ప్రణాళికను ఆదివారం ఉదయం తిరుపతిలోని ఐన్ స్టీన్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యాపరిరక్షణ కమిటి విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నూతన జాతీయ విద్యావిధానం-2020 దేశంలోనూ, రాష్ట్రంలోనూ గత రెండు సంవత్సరాలుగా అమలవుతోంది.

ఈ నూతన విద్యావిధానానికి 21వ శతాబ్దపు నైపుణ్యాలను సాధించే లక్ష్యముందని చెపుతూనే, భారతీయ ప్రాచీన సంస్కృతి వారసత్వం దీపదారి అని ప్రకటించడం ద్వారా విద్యలో హిందుత్వ వాద ఆధిపత్యాన్ని తీసుకురాదలిచిందని ఈ ప్రత్యామ్నాయ ప్రణాకలో విమర్శించారు. ఫలితంగా విద్యార్థులు లోతైన జ్ఞానాన్ని, మేధస్సును, స్వతంత్ర ఆలోచనా శక్తిని పొందడానికి బదులు, కొన్ని నైపుణ్యాలతో చవకైన శ్రామిక శక్తిగా తయారు చేసి ఆర్థిక ఆధిపత్య వర్గాలకు వీరిని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

సంస్కృతాన్ని ఒక భాషగా, అందులోని సారస్వతాన్ని చదువుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. వీటిలోనే జ్ఞాన భాండాగారమంతా ఉందని, ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర భాండాగారమంతా ఉందని, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆవిష్కరణలన్నీ ఆనాడే జరిగాయని నూతన జాతీయ విద్యావిధానం-2020 రూపకర్తలు మూర్ఖంగా వాదించడం అభ్యంతర కరం.

ప్రపంచ బ్యాంకు రుణ ఒప్పదాల పేరు మీద మన విద్యారంగ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం 1990 నుంచి మొదలైంది. అది నిర్దేశించిన ప్రాథమిక విద్యా పథకం తరువాత సర్వశిక్షఅభియాన్ గా రూపొందింది. ఫలితంగా సెమిస్టర్ విధానం, ఉపాధ్యాయులను విద్యేతర పనులకు కేటాయించడం, విద్యార్థులను మార్కుల పోటీలో పరుగులుపెట్టించడం వచ్చాయి.

విద్యావ్యవస్థకు పునాదైన పాఠశాల విద్యలో భాగమైన రెండేళ్ళ పూర్వ ప్రాథమిక విద్య, పది లేదా పన్నెండు సంవత్సరాల పాఠశాల విద్య పూర్తిగా పబ్లిక్ రంగంలో ప్రభుత్వ నిధులతోనే నడవాలి. కిలో మీటరు పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిటోమీటర్ల పరిధిలోఉన్నత పాఠశాల ఉండాలని ప్రత్యామ్నాయ విద్యావిధానం కోరింది.

అయిదేళ్ళ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే నిర్వహించాలి. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20కి మించరాదు. అలాగే ఆరు నుంచి పదవతరగతి వరకు 1:30కి మించరాదు. ఈ దశలోనే వివిధ విజ్ఞాన, సామాజిక శాస్త్రాల మౌలిక అంశాల జ్ఞానాన్ని అందించాలని కోరింది. ఉన్నత విద్యకు ఇంటర్మీడియట్ సన్నద్ధం చేసేదిగా ఉండాలని కోరింది.

డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా, కాంట్రాక్ట్ అధ్యాపకులతో, గెస్ట్ ఫ్యాకల్టీలతో నిర్వహించడం వల్ల ఉన్నత విద్య ఉనికికే ప్రమాదకరంగా తయారైందని ఆరోపించింది. మూడేళ్ళ డిగ్రీని, రెండేళ్ళ పీజీని యథాతథంగా కొనసాగించాలి. ఉన్నత విద్యారంగాన్ని వాణిజ్య సరుకుగా పరిగణించి, విదేశీ పెట్టుబడులను అనుమతించే చర్యలను మానుకోవాలని కోరింది.

పరిశోధనలకు జీడీపీలో కేవలం 0.6 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు. అమెరికాలో 4 శాతం, ఇజ్రాయిల్ లో 4.22 శాతం కేటాయిస్తున్నారు. బోధనను పరిశోధనను వేరు చేయాలని చూస్తున్నారు కానీ ఇది సరికాదు. ఉన్నత విద్యలో బోధన, పరిశోధన కలిసి జరగాలని కోరింది.

జాతీయ నూతన విద్యావిధానంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ప్రత్యామ్నాయ విద్యావిధాన ప్రణాళికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఉపాధ్యక్షులు ఎస్.గోవింద రాజులు, సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ, ఏ హరీష్, జి.ప్రతాప్ సింగ్, విద్యార్థి నాయకులు ఏ రాహుల్, వెంకట సుబ్బయ్య, ఎస్. నవీన్, మధు, ఎస్.కె.అమీన తదితరులుపాల్గొన్నారు.

Read More
Next Story