విమానాలు..హెలికాప్టర్లు..ముగ్గురూ గాల్లోనే
x

విమానాలు..హెలికాప్టర్లు..ముగ్గురూ గాల్లోనే

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జగన్ నిప్పులు చెరిగారు.


రాష్ట్రంలో పాలన పడకేసింది. కానీ పాలకులు మాత్రం గాల్లో తేలుతున్నారు. ముఖ్యమంత్రికి ఒక హెలికాప్టర్, లోకేష్‌కు ఒక విమానం, పవన్‌కు మరో హెలికాప్టర్. ఇలా కూటమి నేతలంతా గాల్లోనే విహరిస్తున్నారు. కిందికి దిగి ప్రజల కష్టాలు చూసే తీరిక వారికి లేదు. అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2026-27 బడ్జెట్‌ను అబద్ధాల పుట్టగా అభివర్ణిస్తూ ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

పర్ఫార్మెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్

చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ మూడో బడ్జెట్ ప్రజలను వంచించడానికేనని జగన్ మండిపడ్డారు. అబద్ధానికి రెక్కలు కడితే అది చంద్రబాబే.. మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే ఆయనే కనిపిస్తారు. అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం దేశంలోని 23 రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిలో ఏపీ 22వ స్థానంలో ఉందని, చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న మనం నంబర్ వన్ అని ఎలా చెప్పుకుంటామని ప్రశ్నించారు.

క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబోకు వెళ్లాలా?

నారా లోకేష్ విదేశీ పర్యటనలపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకపూట విజయవాడలో, మరో పూట హైదరాబాద్‌లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి విజయవాడ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి కొలంబోకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో కూర్చుని టీవీలో మ్యాచ్ చూడలేరా? రాష్ట్రం అప్పుల్లో ఉంటే ప్రజా ధనంతో ఇలాంటి విలాసాలు అవసరమా? అని నిలదీశారు. రాష్ట్ర ఆదాయమంతా చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేల జేబుల్లోకి దోచుకో.. దాచుకో.. పంచుకో అన్న చందంగా వెళుతోందని ఆరోపించారు.

సూపర్ సిక్స్.. సూపర్ క్విట్

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు బడ్జెట్‌లో గాలికి కొట్టుకుపోయాయని జగన్ విమర్శించారు. మహిళలను మోసం చేశారని, ప్రతి మహిళకు నెలకు రూ. 1500, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులను వంచన చేశారని, అన్నదాత సుఖీభవ కింద రూ. 20,000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు బడ్జెట్‌లో ఆ ఊసే లేదని మండిపడ్డారు. నిరుద్యోగుల పరిస్థితి గాలికి వదిలేశారని , యువగళం పేరుతో యువతను మభ్యపెట్టి, ఇప్పుడు నిరుద్యోగ భృతిని చెత్తబుట్టలో వేశారని ధ్వజమెత్తారు. పథకానికి అమ్మవారి పేరు పెట్టి మరీ ఆడబిడ్డలను మోసం చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని జగన్ దుయ్యబట్టారు.

అప్పుల్లో రికార్డులు బద్దలు.. మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం

మేము అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ సంక్షోభం వచ్చినా మేనిఫెస్టోను మనసా వాచా అమలు చేశామని జగన్ గుర్తు చేశారు. కానీ చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే కేవలం ఎన్నికల ముందు పంచే చిత్తుకాగితం మాత్రమేనని విమర్శించారు. అప్పుల విషయంలో చంద్రబాబు తన పాత రికార్డులను తానే బద్దలు కొడుతున్నారని, సంపద సృష్టిస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Next Story