
ప్రతీకాత్మక చిత్రం..
జడ్జినే బోల్తా కొట్టించిన AI: హైకోర్టు తీర్పుపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
జడ్జికే చుక్కలు చూపించిన AI: నకిలీ తీర్పుల ఉదంతంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతకంటే వేగంగా సవాళ్లను విసురుతోంది. మనిషి పనిని సులభతరం చేయాల్సిన కృత్రిమ మేధ (AI), ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదోవ పట్టించే స్థాయికి చేరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కోర్టు వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ విస్తుపోయే ఉదంతం, ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది. న్యాయ ప్రక్రియ సమగ్రతకే ఇది గండమని సుప్రీంకోర్టు హెచ్చరిస్తున్న ఈ ఆసక్తికర కథనం చదవండి..
నకిలీ ఉత్తర్వుల ఆధారంగా ఒక ఆస్తి వివాదాన్ని పరిష్కరించిన ఉదంతంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లోని దిగువ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ప్రతివాదులు చేసిన అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. ఇప్పుడు ఆ తీర్పును నిశితంగా పరిశీలించనుంది. ఈ ఉదంతాన్ని "వ్యవస్థాగత ఆందోళన" కలిగించే అంశంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. నకిలీ AI ఆర్డర్లు "న్యాయ ప్రక్రియ సమగ్రతపై నేరుగా ప్రభావం చూపుతాయని" కోర్టు పేర్కొంది.
అసలేం జరిగిందంటే...
విజయవాడలోని ఒక ట్రయల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గత ఏడాది ఆగస్టులో ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో ఓ ఆర్డర్ పాస్ చేశారు. అంతకుముందు ఆ ఆస్తిని సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ఓ అధికారిని నియమించింది. ప్రతివాదులు దీనిని వ్యతిరేకించారు. వారి అభ్యంతరాన్ని తోసిపుచ్చుతూ ఆ న్యాయమూర్తి నాలుగు పాత తీర్పులను ఉదహరించారు. ఆ నాలుగు తీర్పులు అసలు ఉనికిలోనే లేవని, అవి AI ద్వారా సృష్టించినవని తర్వాత తేలింది.
సాధారణంగా కృత్రిమ వ్యవస్థలు (AI)- లేని సమాచారాన్ని ఉన్నట్లుగా భ్రమ కలిగించే (Hallucination) గుణాన్ని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు తప్పుడు సమాచారం కోసం నకిలీ మూలాలను కూడా సృష్టిస్తాయి.
హైకోర్టు ఏమందంటే..
ప్రతివాదులు ఈ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేస్తూ, ఉదహరించిన తీర్పులన్నీ నకిలీవని నిరూపించారు. హైకోర్టు దీనిని అంగీకరించినప్పటికీ, జూనియర్ సివిల్ జడ్జి ఆ పొరపాటును "మంచి ఉద్దేశం" (Good faith)తో చేశారని భావించి, దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. "ఉదహరించిన తీర్పులు ఉనికిలో లేకపోవచ్చు. కానీ కోర్టు సరైన న్యాయ సూత్రాలను పాటించి ఉంటే, కేవలం తప్పుడు తీర్పులను పేర్కొన్నంత మాత్రాన ఆ ఆర్డర్‌ను కొట్టివేయలేం" అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
దీనిపై సదరు జూనియర్ జడ్జి వివరణ ఇస్తూ.. తాను AI టూల్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారని, ఆ తీర్పులు నిజమైనవేనని నమ్మానని కోర్టుకు తెలిపారు. తప్పుగా ఉదహరించాలనే ఉద్దేశ్యం తనకు లేదని, ఆటోమేటిక్ సోర్స్ మీద ఆధారపడటం వల్లే ఈ పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు "కృత్రిమ మేధ (AI) కంటే అసలైన మేధస్సు (Actual Intelligence) కే ప్రాధాన్యత ఇవ్వాలి" అని సూచించింది.
సుప్రీంకోర్టు కఠిన వైఖరి
అయితే, సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించింది. నకిలీ తీర్పులను తీవ్రంగా పరిగణిస్తూ, గత శుక్రవారం ఆ ప్రాపర్టీ వివాదంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తీర్పుల సమయంలో AIని ఉపయోగించడం కేవలం "నిర్ణయ ప్రక్రియలో జరిగిన పొరపాటు" కాదు.. అది "దుష్ప్రవర్తన" (Misconduct) కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
"ఇది కేవలం కేసు మెరిట్స్ గురించి మాత్రమే కాదు. న్యాయ నిర్ణయ ప్రక్రియ, నిర్ధారణకు సంబంధించిన ఒక వ్యవస్థాగత ఆందోళన" అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును లోతుగా పరిశీలిస్తామని చెబుతూ.. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.
పెరుగుతున్న AI ప్రభావం
న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయడానికి AI టూల్స్ ఉపయోగించడంపై కూడా గత నెలలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది "అస్సలు అంగీకరించలేనిది" అని పేర్కొంది.
భారతదేశమే కాదు.. అమెరికా, బ్రిటన్ కోర్టులు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో అమెరికాలోని ఇద్దరు ఫెడరల్ జడ్జిలు AI వాడటం వల్ల తప్పుడు తీర్పులు ఇచ్చారు. 2025 జూన్‌లో ఇంగ్లాండ్, వేల్స్ హైకోర్టు కూడా నకిలీ తీర్పులను వాడొద్దని న్యాయవాదులను హెచ్చరించింది.
ప్రస్తుతం భారత న్యాయవ్యవస్థ న్యాయస్థానాల్లో AI వాడకాన్ని ఎలా నియంత్రించాలనే దానిపై కసరత్తు చేస్తోంది. గత ఏడాది సుప్రీంకోర్టు విడుదల చేసిన 'వైట్ పేపర్'లో.. న్యాయ సంస్థలు, లాయర్లు, క్లర్కులు AIని వాడేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను పేర్కొంది. మానవ పర్యవేక్షణ (Human oversight) ఉండాలని, వ్యవస్థాగత రక్షణలు పటిష్టంగా ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది.
సాంకేతికత ఒక సాధనం మాత్రమే, అది మేధస్సుకు ప్రత్యామ్నాయం కాలేదు. విజయవాడ కోర్టు ఉదంతం కేవలం ఒక పొరపాటుగా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న ప్రమాదం చాలా పెద్దది. న్యాయమూర్తులు, న్యాయవాదులు 'షార్ట్ కట్'ల కోసం సాంకేతికతపై అతిగా ఆధారపడితే, సామాన్యుడికి అందే న్యాయం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టు దీనిపై తీసుకోబోయే తదుపరి చర్యలు భవిష్యత్తులో ఏఐ వినియోగానికి గైడ్‌లైన్స్‌గా మారనున్నాయి.
Next Story

