
మహారాష్ట్ర: అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్‌సీపీ విలీనం సాధ్యమేనా?
అజిత్ మరణం తర్వాత మూడు రోజులకే సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విలీనాన్ని అసాధ్యంగా మార్చిందా?
మహారాష్ట్ర(Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పునరేకీకరణపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. బారామతిలో అజిత్ పవార్ (Ajit Pawar) కుమారులు జే, పార్థ్‌లను శరద్ పవార్(Sharad Pawar) కలవడం చర్చకు దారితీసింది. అయితే ఈ సమావేశాలను రాజకీయ కోణంలో చూడకూడదని విశ్లేషకులు చెబుతున్నారు.
‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ కార్యక్రమంలో ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘‘బారామతిలో రెండు వేర్వేరు సమావేశాలు జరిగాయి. ఒకటి విద్యా భారతి ప్రతిష్ఠాన్ ట్రస్ట్‌కు సంబంధించినది. మరొకటి అజిత్ పవార్ కుటుంబసభ్యులను పరామర్శించడానికి సునేత్రా పవార్ (Sunetra Pawar) నివాసానికి శరద్ పవార్ వెళ్లడం.. అజిత్ కుమారులను ట్రస్ట్ కార్యకలాపాల్లోకి ఆహ్వానించడం సంస్థాగత నిర్ణయం. అది రాజకీయ సంకేతం కాదు’’ అని అభిప్రాయపడ్డారు.
అజిత్ పవార్ జీవించి ఉన్నపుడే పునరేకీకరణపై చర్చలు జరిగాయని, ఫిబ్రవరి మధ్యలో విలీనం ప్రకటన వచ్చే అవకాశమూ ఉన్నట్టు శ్రీనివాసన్ గుర్తు చేశారు. కానీ అజిత్ ఆకస్మిక మరణంతో ఆ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిందని అన్నారు. అనంతరం మూడు రోజులకే సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందన్నారు. ఈ నిర్ణయం గురించి తనకు తెలియదని శరద్ పవార్ చెప్పడం కుటుంబం, రాజకీయ సమన్వయంపై సందేహాలు రేకెత్తించిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రెండు వర్గాల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయని, తక్షణ విలీనం సాధ్యం కాదని శ్రీనివాసన్ స్పష్టం చేశారు. శరద్ పవార్ బీజేపీ, ఎన్డీఏపై విమర్శలు చేస్తుండగా..సునేత్రా పవార్ నేతృత్వంలోని అజిత్ పవార్ వర్గం మాత్రం బీజేపీతో మైత్రి కొనసాగిస్తోంది.
అదే సమయంలో బీజేపీ(BJP)కి కూడా ఎన్‌సీపీ విలీనం అవసరం లేదని, బలమైన ప్రాంతీయ పార్టీలను విభజించడం వారి దీర్ఘకాల వ్యూహమని ఆయన విశ్లేషించారు. ఇక భవిష్యత్తులో వారసత్వ రాజకీయాలు కూడా కీలక అంశంగా మారనున్నాయని, సునేత్రా పవార్ రాజకీయంగా కొత్తవారే కావడంతో ఆమె కుమారులు రాజకీయాల్లోకి వస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు. మొత్తంగా చూస్తే ఎన్‌సీపీ విలీనం ఇప్పటికైతే రాజకీయ చర్చలకే పరిమితమైందే తప్ప వాస్తవానికి దూరంగానే ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

