రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: నలుగురు మృతి..సీఎం సీరియస్
x

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: నలుగురు మృతి..సీఎం సీరియస్

బాధితుల రక్తం, మూత్ర నమూనాలను టాక్సికాలజీ (Toxicology) పరీక్షల కోసం పంపించారు.


ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పాలే కాలయముడిలా మారాయి. తెల్లటి పాలు నల్లటి విషమై రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్‌లో మృత్యుఘోషను నింపాయి. పవిత్రమైన శివరాత్రి పర్వదినం నాడు అమాయక ప్రజలు తాగిన ఆ పాలు.. వారి కిడ్నీలను నిర్వీర్యం చేస్తూ నలుగురిని బలితీసుకున్నాయి. ఐదు నెలల పసికందు నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు మంచాన పడేలా చేసిన ఈ పాల మాయాజాలం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఆ వ్యాపారి పోసిన పాలలో కలిసిన ఆ ప్రాణాంతక రసాయనం ఏంటి? ఈ ఘోర కలికి బలైపోయిన కుటుంబాల కన్నీటి గాథలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి అధికారులను పరుగులు తీయిస్తున్నారు.

విషాదం వెనుక పాలు.. ఏం జరిగింది?

లాలాచెరువు, చౌడేశ్వరినగర్ ప్రాంతాల్లో శివరాత్రి (ఫిబ్రవరి 15) నుంచి వింత పరిస్థితి నెలకొంది. పాలు, పెరుగు వినియోగించిన వారికి వాంతులు కావడం, మూత్రవిసర్జన ఆగిపోవడం, పొట్ట ఉబ్బడం వంటి లక్షణాలు కనిపించాయి. ఇప్పటివరకు 14 మంది ఆసుపత్రిలో చేరగా, అందులో ఎక్కువ మంది వృద్ధులే. ఐదు నెలల శిశువు, మూడేళ్ల బాలుడు కూడా బాధితుల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బాధితులందరికీ కోరుకొండకు చెందిన గణేష్ అనే వ్యాపారి పాలు పోస్తున్నట్లు గుర్తించారు. పాలు చేదుగా ఉన్నాయని బాధితులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సీఎం చంద్రబాబు సీరియస్: తక్షణ సమీక్ష

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సోమవారం కలెక్టర్, ఎస్పీ , ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విక్రయదారులు సుమారు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేశారని, ఇప్పటికే 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని అధికారులు సీఎంకు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. పాల నమూనాల నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

టాక్సికాలజీ పరీక్షలే కీలకం

బాధితుల రక్తం, మూత్ర నమూనాలను టాక్సికాలజీ (Toxicology) పరీక్షల కోసం పంపించారు. పాలలో ఏ రకమైన రసాయనం కలిసింది? అది కిడ్నీలపై ఎలా ప్రభావం చూపిందనేది ఈ నివేదికల ద్వారా తేలనుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Read More
Next Story