
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల గడువు ఏప్రిల్ 7 వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఏ కృష్ణమోహన్.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును ఏప్రిల్ 7, 2026 వరకు పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీలు (APRS CAT-2026) నింపడం మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (APRJC CET-2026), డిగ్రీ మొదటి సంవత్సరం (DC CET-2026) ప్రవేశాలకు ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని కార్యదర్శి వివరించారు.
అర్హత ఉన్న అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. ఆన్‌లైన్ పద్ధతి కాకుండా నేరుగా సంస్థకు లేదా గురుకుల విద్యాలయాలకు స్వయంగా, పోస్టు ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులు పరిశీలించబడవని, అలాంటి అభ్యర్థులను ప్రవేశ పరీక్షలకు అనుమతించబడరని ఎ. కృష్ణమోహన్ స్పష్టం చేశారు.

