SP Dheeraj
x
SP Dheeraj press conference

చిన్నారిపై లైంగికదాడి కేసు నిందితుడి చావుతో మాకే సంబంధం లేదు-ఎస్పీ

పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నప్పుడు తప్పించుకుని పారిపోయాడన్న ఎస్పీ ధీరజ్


అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, దారుణ హత్య కేసులో నిందితుడు కులవర్దన్ చావుతో తమకేమీ సంబంధం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కులవర్ధన్ మృతదేహం బుధవారం ఉదయం కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో లభ్యమైంది. నిందితుడి మృతిపై రకరకాల అనుమానాలు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు.
అసలేం జరిగింది?
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కులవర్ధన్‌ను అతని నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అతను పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, బుధవారం ఉదయం కనసానిపల్లె చెరువులో ఒక మృతదేహం తేలియాడుతున్నట్లు సమాచారం అందిందని ఎస్పీ వివరించారు.
చెరువులో దొరికిన మృతదేహాన్ని కులవర్ధన్‌గా అతని బంధువులు గుర్తించారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. బంధువుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోలీసుల నుండి తప్పించుకున్న తర్వాత కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ స్పష్టం చేశారు.
"కులవర్ధన్ మృతితో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసుల నుండి తప్పించుకున్నాక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టత ఇచ్చారు.
Read More
Next Story