
పరారీలో ఉన్న హరికృష్ణ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు లొకేషన్‌ను వెంబడించి, ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
రాయవరం సమీపంలో 14 మందిని బలితీసుకున్న భీకర రోడ్డు ప్రమాద ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి కేంద్రంగా ట్రావెల్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతనిపై బాధితుల కుటుంబాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 14 మంది సజీవ దహనానికి కారణమైన వాహన నిర్వహణ లోపాలు, యాజమాన్య నిర్లక్ష్యంపై నిలదీసేందుకు పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చెేజ్..
నిందితుడు హరికృష్ణారెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు లొకేషన్‌ను వెంబడించి, ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. 28 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తరుణంలో, యజమాని పరారీలో ఉండటంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం పోలీసులు అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి హరికృష్ణ ట్రావెల్స్ పాటించిన నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో బస్సు నడపడం, ఫిట్‌నెస్ లోపాలు, డ్రైవర్ల పని గంటల వంటి అంశాలపై హరికృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Next Story

