
ఏ7 అవినాష్‌రెడ్డికి ఒక్క రోజు రిమాండ్ ఎందుకంటే
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏడాది పరారీలో ఉన్న ఏ7 అవినాష్ రెడ్డి సిట్‌కు చిక్కాడు.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఆయన సిట్ అధికారుల ఎదుట లొంగిపోగా, విచారణ అనంతరం అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు నిందితుడికి శుక్రవారం (ఫిబ్రవరి 27) వరకు రిమాండ్ విధించింది.
థాయ్‌లాండ్ పారిపోయి.. ఉచ్చు బిగించడంతో లొంగుబాటు
గతేడాది ఫిబ్రవరిలో మద్యం కుంభకోణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన వెంటనే, అవినాష్ రెడ్డి థాయ్‌లాండ్‌కు పారిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు, ఆయనను విదేశాల నుంచి రప్పించేందుకు వ్యూహాత్మకంగా ఉచ్చు బిగించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికావడం, లొంగిపోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో గత్యంతరం లేక ఏడాది తర్వాత ఆయన భారత్‌కు తిరిగి వచ్చి అధికారుల ఎదుట హాజరయ్యారు.
మనీ లాండరింగ్‌లో కీలకం
మద్యం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కేసీరెడ్డి)కి అవినాష్ రెడ్డి స్వయానా తోడల్లుడు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో లంచాల వసూళ్ల నెట్‌వర్క్ నిర్వహణ, డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేయడంలో అవినాష్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. రాజశేఖర్ రెడ్డి తరలించిన సొమ్ముకు సంబంధించిన కంపెనీలకు ఈయనే నేతృత్వం వహించారని, ఒక్క సంతకంతో వేలాది లావాదేవీలు జరిపారని డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి వాదించారు.
తోడల్లుళ్లు ఒకే జైల్లో ఉంటే దర్యాప్తుకు ముప్పు
రాజ్ కేసీరెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉండటంతో, అవినాష్ రెడ్డిని కూడా అక్కడే ఉంచితే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడికి కాలి గాయం ఉందని, విజయవాడలోనే ఉంచాలని రక్షణ పక్ష న్యాయవాది కోరినప్పటికీ, కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. నిందితులందరి రిమాండ్ గడువు ఒకే తేదీన ఉండేలా అవినాష్ రెడ్డికి ఒక రోజు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఎస్కార్ట్ సిబ్బందిని ఆదేశించారు.
రిమాండ్ గడువులో వ్యూహం: అందరితో పాటే అవినాష్
మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఇతర నిందితుల రిమాండ్ గడువు శుక్రవారంతోనే (ఫిబ్రవరి 27) ముగియనుంది. ఈ నేపథ్యంలో, దర్యాప్తు ప్రక్రియలో గందరగోళం లేకుండా ఉండాలని, నిందితులందరినీ ఒకేసారి కోర్టులో హాజరుపరిచేలా సిట్ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి, కొత్తగా అరెస్టైన అవినాష్ రెడ్డికి తొలుత కేవలం ఒక్క రోజు మాత్రమే రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా శుక్రవారం నాడు ప్రధాన నిందితుడు రాజ్ కేసీరెడ్డితో సహా మిగిలిన వారందరితో కలిపి అవినాష్ రెడ్డి రిమాండ్ పొడిగింపుపై కూడా కోర్టు ఒకేసారి నిర్ణయం తీసుకోనుంది.
Next Story

