
’వచ్చావా.. ఈ అబ్బాయి మా ఊరి వాడే.. మేమిద్దరం ప్రేమించుకున్నాం‘
సినిమాల్లో జరిగే సీన్ మైలవరంలో కళ్లముందు కదలాడింది.
మంగళ వాయిద్యాల హోరు.. ముత్తైదువల అక్షింతల సందడి.. సరిగ్గా జీలకర్ర-బెల్లం పెట్టి, వరుడు తాళి కట్టే శుభ ముహూర్తం.. అంతా సిద్ధమైందనుకుంటున్న వేళ.. పెళ్లి మండపం ఒక సినిమా సీన్‌ను తలపించే హైడ్రామాకు వేదికైంది. అందరూ వధూవరుల వైపు ఆశగా చూస్తుంటే.. వధువు మాత్రం.. గుమ్మం వైపు చూస్తూ ఉండిపోయింది. ఒక్కసారిగా ఒక యువకుడు మండపం ముందుకు రాగానే.. పీటల మీద నుంచి లేచిన వధువు.. ’వచ్చావా..‘ అంటూ అందరినీ నిశ్చేష్టులను చేసింది. ’ఈ అబ్బాయి మా ఊరివాడే.. మేమిద్దరం ప్రేమించుకున్నాం‘ అంటూ ఆమె చెప్పిన మాటలు పెళ్లికి వచ్చిన వేల మంది బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్న రహస్యం, పీటల మీద తాళి కట్టే క్షణంలో బాంబులా పేలడంతో మైలవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది.
పీటల మీద నుంచి ప్రియుడి చెంతకు..
అది ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక గ్రామం. పెళ్లి మండపమంతా బంధువుల కోలాహలం, సందడితో కళకళలాడుతోంది. సరిగ్గా ముహూర్తం సమయానికి వధూవరుల తలలపై జీలకర్ర-బెల్లం కూడా పెట్టారు. మరికాసేపట్లో వరుడు తాళి కట్టాల్సి ఉండగా, అచ్చం తెలుగు సినిమా స్టైల్లో.. హడావుడిగా ఓ యువకుడు మండపం ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడిని చూడగానే వధువు ముఖంలో ఒక్కసారిగా వెలుగు మెరిసింది. పక్కనే ఉన్న వరుడిని, ఎదురుగా ఉన్న పెద్దలను పట్టించుకోకుండా పీటల మీద నుంచి లేచి నేరుగా ఆ యువకుడి పక్కన నిలబడింది. తన ప్రేమ విషయాన్ని అందరి ముందే బాంబు పేల్చినట్లు చెప్పడంతో, వరుడితో పాటు బంధువులంతా నిశ్చేష్టులయ్యారు.
రణరంగంగా మారిన మండపం
వధువు మాటలతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరి నిమిషంలో వచ్చి పెళ్లి చెడగొడతావా అంటూ వరుడి బంధువులు ఆ యువకుడిపై దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పెళ్లి మండపం కాస్తా రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని ఘర్షణను నిలువరించారు. అయితే, వధువు తన పట్టు వీడకపోవడంతో అంతా సిద్ధమైన పెళ్లి కాస్తా అర్థాంతరంగా ఆగిపోయింది.
వరుడి తల్లిదండ్రుల ఆవేదన
కలలో కూడా ఊహించని ఈ పరిణామంతో వరుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మాకు ఒక్కగానొక్క కుమారుడు.. వాడి పెళ్లిని ఊరంతా మెచ్చుకునేలా చేయాలనుకున్నాం. సుమారు రూ. 20 లక్షలు ఖర్చు చేసి వేల మందికి విందు భోజనాలు ఏర్పాటు చేశాం. అందరూ తిని వెళ్లిన తర్వాత ఇలా పీటల మీద పెళ్లి ఆపి మా పరువు తీస్తారా? అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది విందు ఆరగించిన తర్వాత ఈ డ్రామా జరగడం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
పంచాయితీతో ముగింపు
పెళ్లి ఆగిపోయిన తర్వాత శనివారం ఉదయం ఇరువర్గాల వారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించుకున్నారు. జరిగిన అవమానం, ఆర్థిక నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. చివరికి ఇరు పక్షాలు ఒక అవగాహనకు రావడంతో వివాదం సర్దుమణిగింది. ప్రేమించిన వాడి కోసం పెళ్లి పీటల మీద నుంచి వధువు వెళ్ళిపోయిన ఈ ఉదంతం ఇప్పుడు మైలవరం ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
Next Story

