ఓ చిన్న ప్రయాణం.. ఓ పెద్ద కథ! సునీత ఎలా చిక్కుబడిందంటే..
x
Sunita Williams

ఓ చిన్న ప్రయాణం.. ఓ పెద్ద కథ! సునీత ఎలా చిక్కుబడిందంటే..

45 నిమిషాల్లో అంతరిక్షానికి వెళ్లి ఓ10 రోజులుండి పని చేద్దామనుకుంటే అది కాస్తా 9 నెలలు దాటిపోయింది. అసలేం జరిగిందీ? ఈ 9 నెలలు ఆమె ఏమి చేశారు?


సునీతా విలియమ్స్.. అంతరిక్ష యాత్ర ఆమెకు కొట్టిన పిండే. అనుభవజ్ఞమైన అంతరిక్షయాత్రికురాలు. ఎన్నో అనుభవాల మేలు కలయిక. భూమిని వదిలి అంతరిక్షంలో తిరగడం ఆమెకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి ప్రయాణం ఎలా మలుపు తిరిగిందో ఆమె కూడా ఊహించలేదు! కేవలం 45 నిమిషాల్లో అంతరిక్షానికి వెళ్లి ఓ పది రోజులుండి పని చేద్దామనుకుంటే అది కాస్తా 9 నెలలు దాటిపోయింది.
2024 జూన్‌లో, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌తో కలిసి బోయింగ్‌ స్టార్లైనర్‌ లో అంతర్జాతీయ అంతరిక్ష స్థావరానికి (ISS) వెళ్లారు. వారి ప్రయాణం- కేవలం కొన్ని రోజుల పరీక్షా ప్రయోగం కోసమే కావాలి. కానీ అనుకోని సాంకేతిక సమస్య ఎదురైంది.

స్టార్లైనర్‌ తొలిసారి మానవులతో ప్రయాణం చేస్తోంది. ఇది కేవలం పరీక్ష రాకెట్ ప్రయోగం. 45 నిమిషాల్లో అంతరిక్ష స్థావరం చేరుకోవడానికి సరిపోతుందని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది.
ఒక చిన్న లోపం... ఒక పెద్ద పరీక్ష
అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాన్ని propulsion issue అంటారట. ప్లానింగ్ లోపం అని తేల్చారు. దీంతో పోవడం వరకు సరిగానే సాగినా తిరుగు ప్రయాణం సమయానికి ఆ స్టార్ లైనర్ లో సమస్యను గుర్తించారు. దీంతో వారి తిరుగు ప్రయాణాన్ని నిలిపివేశారు. మనుషులతో భూమికి రావడానికి ఆ రాకెట్‌ సాంకేతికంగా సురక్షితం కాదు అని నిపుణులు తేల్చారు. దీంతో 45 నిమిషాల ప్రయాణం... తొమ్మిది నెలల నిరీక్షణగా మారింది!
వాళ్లిద్దరూ అక్కడ ఉండాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. అయితే, ఇది ఊహించని అనుభవాన్ని అందించింది. కొత్త అంతరిక్ష ప్రయోగాల్లో భాగం అయ్యారు. ISSలో మరిన్ని ప్రయోగాలకు సహాయపడ్డారు. భూమి నుంచి దూరంగా నెలల తరబడి గడపడం చాలా మంది అంతరిక్షయాత్రికులకు మానసిక, శారీరక పరీక్షే. కానీ, సునీతా విలియమ్స్ తన చిరపరిచిత అనుభవంతో చిరునవ్వుతోనే ఈ పరిస్థితిని స్వీకరించారు. గడ్డుకాలాన్ని అనువుగా మార్చుకుని సరికొత్త ప్రయోగాలకు నడుంకట్టారు.
అంతరిక్ష కేంద్ర రోజువారీ నిర్వహణ బాధ్యతల్లో సునీత, విల్మోర్‌ చురుకైన పాత్ర పోషించారు. ఈ కేంద్రానికి మరమ్మతులు చేపట్టారు. అక్కడ నిర్వహిస్తున్న శాస్త్రీయ ప్రయోగాలకు తోడ్పాటు అందించారు. 150కిపైగా ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. ఇందులో అంతరిక్ష వ్యవసాయం, భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన ఉన్నాయి.
తిరిగి ఇంటికి రావడం... ఒక అద్భుత అనుభూతి!
మొత్తానికి 2025 మార్చి 19... భూమి పిలిచింది. స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లో బుచ్ విల్‌మోర్, సునీతా విలియమ్స్ తో పాటు అప్పటికే ఐఎస్ఎస్ లో పని చేస్తున్న మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమి మీదకు వచ్చారు. 17 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం భూమిని చేరుకున్నారు. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3:27 (భారతీయ కాలమానం-IST) గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో సురక్షితంగా ల్యాండయ్యారు.
"ఎలాగైనా భూమి మీద మళ్లీ శ్వాసించగలమన్న నమ్మకంతో కష్టాలను మరిచి తేలికగా ఉండిపోగలిగాం..." అని నావికాదళ సిబ్బంది బయటకు తీసినప్పుడు సునీతా నవ్వుతూ చెప్పింది. కొన్ని క్షణాలు భూమిపై నిలబడడం కూడా కొత్త అనుభూతిలా అనిపించింది!
ఆమె మళ్లీ భూ వాతావరణంలో ఇమడడానికి 45 రోజుల పాటు పునరావాస కార్యక్రమం (rehabilitation program) ఉంటుంది. అది హ్యూస్టన్‌లో ఉంటుంది.
నిండు అనుభవం, కొత్త కథలు!
ఈ తొమ్మిది నెలల ఊహించని ప్రయాణం సునీతా విలియమ్స్ జీవితంలో మరో కొత్త అధ్యాయం. ఈ అనుభవం ఆమెను ఇంకా దీటుగా మార్చింది. భూమిని దాటి వెళ్ళిన ఈ భారతీయ మూలాలు ఉన్న మహిళ, మరలా మనల్ని కలుస్తోంది. సునీతా విలియమ్స్ అంటే కేవలం ఒక అంతరిక్షయాత్రికురాలు మాత్రమే కాదు... ఆమె ఓ సాహసవంతురాలు, ఓ నిరంతర సంచారి. ఓ స్ఫూర్తిదాయక స్టార్.
ఆమె తండ్రి భారతీయుడే...
ఆమె పేరు సునీత. భారతీయ మూలాలున్న వ్యక్తి. 1965 సెప్టెంబర్ 19న పుట్టారు. వచ్చే సెప్టెంబర్ నాటికి ఆమెకి 60 ఏళ్లు నిండుతాయి. సునీతా విలియమ్స్‌ ప్రముఖ అమెరికన్‌ వ్యోమగామి. యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ అధికారి. ఒహియో రాష్ట్రంలోని యూక్లిడ్‌లో జన్మించారు. తండ్రి డాక్టర్‌ దీపక్‌ పాండ్యా. ఇండియన్ అమెరికన్‌ న్యూరో అనాటమిస్ట్‌. తల్లి బోనీ. స్లోవేనియా సంతతికి చెందినవారు. సునీతా తండ్రి దీపక్ పాండ్యా కుటుంబం గుజరాత్‌ రాష్ట్రానికి చెందింది.​

సునీతా విలియమ్స్‌ 1987లో యునైటెడ్‌ స్టేట్స్‌ నావల్‌ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. తర్వాత 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె 1987లో యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీలో చేరి, నావల్‌ ఏవియేటర్‌గా సేవలు అందించారు. 1998లో నాసా వ్యోమగామి ప్రోగ్రామ్‌ కోసం ఎంపికయ్యారు.​
వివాహం విలియమ్స్ తో...
సునీత మైఖేల్‌ జే. విలియమ్స్‌ను వివాహం చేసుకున్నారు. మైఖేల్‌ ఫెడరల్‌ పోలీస్‌ అధికారి. సునీతా విలియమ్స్‌కు పరుగుపందెం, ఈత, సైక్లింగ్‌ వంటి క్రీడల్లో ఆసక్తి ఉంది. ఆమె బోస్టన్‌ రెడ్‌ సాక్స్‌ బేస్‌బాల్‌ జట్టుకు వీరాభిమాని. పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఆమెకు గోర్బి అనే కుక్క ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఈ డాగ్ వెంట ఉంటుంది.
2007లో సునీతా విలియమ్స్‌ భారత్ లో పర్యటించారు. ఈ పర్యటనలో సబర్మతి ఆశ్రమం, గుజరాత్‌లోని తన పూర్వీకుల గ్రామం ఝులాసన్‌ను సందర్శించారు. ఆమెకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విశ్వ ప్రతిభ అవార్డు, పద్మ భూషణ్‌ పురస్కారం అందుకున్నారు.​
సునీతా విలియమ్స్‌ తన వ్యోమగామి కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించారు. ఆమె మహిళా వ్యోమగాముల్లో అత్యధిక స్పేస్‌వాక్‌లు చేసిన వ్యక్తిగా నిలిచారు. ఆమె స్పేస్‌వాక్‌లలో గడిపిన సమయం 50 గంటల 40 నిమిషాలు. ఆమె మొత్తం 321 రోజులు 17 గంటలు 15 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు.​
Read More
Next Story