‘అరసం చందు‘ కలానికి ఇక శాశ్వత విరామం!
x
చందు సుబ్బారావు

‘అరసం చందు‘ కలానికి ఇక శాశ్వత విరామం!

మార్క్సిస్టు రచయిత, అభ్యుదయ రచయితల సంఘం ప్రముఖుడు, సాహిత్య సేవకుడు ఆచార్య చందు సుబ్బారావు మరణం సాహితీ ప్రియులను విషాదంలో ముంచింది.

చందు సుబ్బారావు.. మార్క్సిస్టు రచయితగా, అధ్యాపకునిగా, భూభౌతిక శాస్త్రవేత్తగా, అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యునిగా తనదైన గుర్తింపు పొందారు. చలం స్త్రీవాద భావాలను బలంగా నమ్మేవారు. ఆ దృక్పథంతోనే ఆయన స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ, శాస్త్రీయ అంశాలపై అనేక వ్యాసాలు రాశారు. మరెన్నో పుస్తకాలను రచించారు. ఇలా సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. జియో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా ఆయన దేశంలోనే ప్రముఖునిగా గుర్తింపు పొందారు. ఆయన హయాంలో ఎంతో మంది పరిశోధకులు పీహెచ్‌డీ పట్టాలను అందుకున్నారు. మునుపటి తరం ప్రముఖ రచయితలు రావి శాస్త్రి వంటి వారితో పాటు నాటక రచయిత విరియాల లక్ష్మీపతి తదితరులతో సుబ్బారావుకు మంచి అనుబంధం ఉంది.

చందు సుబ్బారావు ప్రస్థానం..
చందు సుబ్బారావు స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని చదలవాడ.1946 మే 18న వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో 1964లో బీఎస్సీ చదివారు. 1967లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అనంతరం 1974లో జియో ఫిజిక్స్‌లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. అనంతరం ఆ విశ్వవిద్యాలయంలోనే లెక్కరర్‌గా, రీడర్‌గా పనిచేశారు. అంతేకాదు.. రష్యన్‌ భాషలో జూనియర్‌ డిప్లొమా కూడా పొందారు. 1992 నుంచి హైడ్రాలజీ అండ్‌ వెల్‌ లాగింగ్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘానికి 1979–82 మధ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఇంకా విశాఖ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీకి ఉప ప్రిన్సిపాల్‌గా, అధికార భాషా సంఘం సభ్యుని గానూ పనిచేశారు. ఇండియా మెటిరియాలజికల్‌ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు.
సాహిత్యంలో చందుది తనదైన ముద్ర..
చందు సుబ్బారావు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. సైన్స్‌ అండ్‌ సివిలైజేషన్‌ (1997), కవికి విమర్శకుడు శత్రువు కాదు (1997), హిందీలో శ్రీశ్రీ కా ఆధునిక్‌ తెలుగు సాహిత్య పర్‌ ప్రభావ్‌’, ఇండియన్‌ నవలికలు వంటి అనేక రచనలు చేశారు చందు. ఇటీవలే నాలుగు విమర్శా గ్రంధాలను కూడా ఒకే పుస్తకంగా వెలువరించారాయన. 1966లో తాపీ ధర్మారావు అవార్డును అందుకున్నారు. 1999లో ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ నుంచి కొండేపూడి సాహితీ సత్కారం పొందారు. జ్యోతిష్యాన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక కోర్సుగా ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి హేతువాద దృక్పథాన్ని ప్రోత్సహించారు.
చందు సుబ్బారావు కుటుంబం గురించి..
చందు సుబ్బారావుకు భార్య, కుమారుడు దిలీప్, కుమార్తె కవిత ఉన్నారు. కుమారుడు దిలీప్‌ అమెరికాలో స్థిరపడగా, కవిత విశాఖలోని గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అనారోగ్యంతో కన్నుమూసిన చందు..
విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్న చందు సుబ్బారావు (80) కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. సుబ్బారావు పార్థివదేహాన్ని శుక్రవారం ఉదయం విశాఖలోని ఆయన స్వగృహం నుంచి ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అంత్యక్రియలు జరపాలని చందు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
సాహితీ ప్రియుల దిగ్భ్రాంతి..
చందు సుబ్బారావు మృతి చెందారన్న వార్త సాహితీ ప్రియులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి పలువురు సాహితీవేత్తలు, విశాఖ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య, ప్రొఫెసర్‌ జీఎస్‌ చలం తదితరులు చందు సుబ్బారావుకు ఘన నివాళులర్పించారు. సంతాపాన్ని తెలిపిన వారిలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, నల్లూరు శివప్రసాద్, రాష్ట్ర నేతలు ఉప్పల అప్పలరాజు, ఏఎంఆర్‌ ఆనంద్, కొమ్మాలపాటి శరత్, విరసం వర్మ, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి, మేడా మస్తాన్‌రెడ్డి, యూజీఎఫ్‌ అధ్యక్షుడు ఎంఆర్‌ఎన్‌ వర్మ తదితరులు విచారం వ్యక్తం చేశారు.
Read More
Next Story