అమరావతి రైతులకు భూమి రిజిస్ట్రేషన్‌లో కొత్త మలుపు!
x
అమరావతి ప్లాన్

అమరావతి రైతులకు భూమి రిజిస్ట్రేషన్‌లో కొత్త మలుపు!

ప్రభుత్వ ఆదేశాల్లో ‘అసైన్డ్’ పదం తొలగింపు, వారసులకు సులభంగా రిజిస్ట్రేషన్ లు.


ఏపీ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కింద అలాట్ చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతుల కోరిక మేరకు ముఖ్యంగా వారసుల పేరుపై ప్లాట్లను రిజిస్టర్ చేయాలని అధికారులకు సూచనలు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 187, తేదీ: సెప్టెంబర్ 17, 2025 ద్వారా ‘అసైన్డ్’ అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

భూముల రిజిస్ట్రేషన్ లో అసైన్డ్ పదం తొలగింపు

భూ సమీకరణ కింద రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించి, బదులుగా అలాట్ చేసిన ప్లాట్లు ఇప్పుడు వారి వ్యక్తిగత ఆస్తులుగా మారనున్నాయి. గతంలో ‘అసైన్డ్ భూమి’గా పరిగణించబడిన కొన్ని ప్లాట్లు, ఇకపై సాధారణ ఆస్తుల మాదిరిగానే రిజిస్టర్ అవుతాయి. రైతులు తమ అభ్యర్థన అందించిన 15 రోజుల్లోగా సవరణ డాక్యుమెంట్లు జారీ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల రైతులు తమ ప్లాట్లను వారసులు లేదా ఇతరుల పేరుపై సులభంగా బదలాయించుకోవచ్చు. బ్యాంకు లోన్లు, విక్రయాలు వంటి లావాదేవీలు మరింత సాఫీగా సాగనున్నాయి.

కోర్టు కేసులు, డిస్ప్యూట్ లు

అయితే కొన్ని రిజిస్ట్రేషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు కోర్టు కేసులు, డిస్ప్యూట్‌లు. ప్రస్తుతం 70 మంది రైతులకు సంబంధించిన 312 ప్లాట్లు కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. అలాగే 450 మంది రైతులకు చెందిన 1,891 ప్లాట్లు వివాదాస్పద కేసుల కారణంగా ఆలస్యమవుతున్నాయి. ఇతర కారణాల్లో డాక్యుమెంట్ల లోపాలు, వారసుల వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి, వేగవంతంగా ముందుకు సాగుతోంది.

లంక భూముల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మరోవైపు లంక భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. మొత్తం 356 కేసుల్లో 98 ఇప్పటికే పరిష్కారం అయ్యాయి. మిగిలినవి 2026 జూన్ 30 నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భూములు ప్రధానంగా నదీతీర ప్రాంతాల్లో ఉండటం వల్ల వివాదాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సమన్వయంతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తోంది.

ఈ నిర్ణయాలతో అమరావతి రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించవచ్చు.

Read More
Next Story